21 July, 2026 | 11:52 AM

బాన్సువాడ బాలింతలను పట్టించుకోరా?

21-07-2026 12:44 AM
  1. కాలం చెల్లిన మందులకు బలి
  2. ప్రభుత్వ నిర్లక్ష్యం నేరమే
  3. బాధిత కుటుంబాలకు వైద్యం, ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): బాన్సువాడ ఆసుపత్రిలో 10 మంది బాలింతలు ఇన్ఫెక్షన్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, 10 రోజులైనా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను, వారి కుటుంబ సభ్యులను హరీశ్‌రావు సోమవారం పరామర్శించారు.

అలాగే, ఖమ్మంలో జరిగిన దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌లోనే చికిత్స పొందుతున్న బాలికను కూడా ఆయన పరామర్శించారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడుతూ..  ఈ నెల 13వ తేదీన బాన్సువాడ ఆసుపత్రిలో డెలివరీకి వెళ్లిన 10 మంది మహిళలకు సిజేరియన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్స్ సోకి పరిస్థితి విషమించిందని, ప్రస్తుతం నిమ్స్‌లో ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మీప్రియ, సునీత అనే ఐదుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారని తెలిపారు.

వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమించినా ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే లేదా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి వచ్చి బాధితులను పరామర్శించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకునే కనీస ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదని, ఇప్పటివరకు పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించకపోవడం దారుణమన్నారు.

10వ తేదీన ఆరుగురికి సిజేరియన్ చేసినప్పుడు వారికి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా.. అదే థియేటర్లో మళ్ళీ మరో నలుగురికి సిజేరియన్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాలం చెల్లిన మందులు వాడటం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఘటనపై తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయి వైద్యం అందించి, వారికి తగిన ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఖమ్మంలో బాలికపై లైంగిక దాడి జరిగినప్పుడు కూడా బీఆర్‌ఎస్ స్పందించేదాకా ప్రభుత్వం రాలేదన్నారు. ఆ కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.