సీఎస్ X సీనియర్స్
- సంజయ్ జాజుకు రెండేన్నరేళ్లకు పైగా సర్వీస్
- దీంతో రేస్‌లోని మిగిలిన అధికారులకు మళ్లీ అవకాశం లేదు
- అందుకే కొత్త సీఎస్‌కు సహకరించట్లేదని చర్చ
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో కొత్త సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ జోరుగా సాగుతున్నది. సాధారణంగా కొత్త సీఎస్ బాధ్యతలు చేపట్టినప్పుడు పని విధానంలో మార్పులు రావడం సహజమే అయినప్పటికీ, ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా ఉందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా సీఎస్ పదవిని ఆశించిన కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు, కొత్త సీఎస్‌కు మధ్య ఆశించిన స్థాయిలో సమన్వయం కనిపించడం లేదన్న ప్రచారం సచివాలయంలో వినిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి విభేదాలు బయటకు రాకపోయినా, అంతర్గతంగా అసంతృప్తి ఉందని, అదే పరిపాలనా వ్యవహారాలపై ప్రభావం చూపుతోందనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా నిర్ణయాల ప్రక్రియ, శాఖల సమన్వయం, ఉన్నతస్థాయి సమావేశాలు, కీలక ఫైళ్ల నిర్వహణ వంటి అంశాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర పరిపాలనా విభాగంలో కీలక పాత్ర పోషించే ఉన్నతాధికారుల మధ్య దూరం ప్రభుత్వంపై ప్రభావం చూపు అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రెండున్నరేళ్ల సర్వీసే కారణమా?..
అయితే కొత్త సీఎస్ సంజయ్ జాజు పదవీకాలం 2029 ఫిబ్రవరి వరకు ఉంది. ప్రస్తుత పరిణామాలకు ఈ పదవీకాలమే ప్రధాన కారణమని చర్చ జరుగుతుంది. ఆయనకు ఇంకా రెండున్నరేళ్లకు పైగా సర్వీస్ మిగిలి ఉంది. దీంతో ప్రస్తుతం సంజయ్‌జాజుతో సీఎస్ రేసులో ఉన్న పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇక ఆ అవకాశం దాదాపు లేకుండాపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాధారణంగా సీఎస్ నియామకం సమయంలో సీనియారిటీ, సేవా అనుభవం, ప్రభుత్వంతో పనిచేసిన తీరు, కేంద్ర స్థాయిలో పరిపాలనా అనుభవం వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తమకూ అవకాశం వస్తుందని భావించిన కొందరు అధికారులు, ఇప్పుడు ఆ అవకాశాలు పూర్తిగా ముగిశాయనే భావనకు వచ్చినట్లు పరిపాలనా వర్గాల్లో చర్చ సాగుతోంది.
సీఎస్ పదవిని ఆశించిన కొందరు అధికారులు ఇప్పుడు కీలక నిర్ణయాల్లో అంతగా చురుకుగా వ్యవహరించడం లేదన్న ప్రచారం వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై జరిగే సమీక్షలు, శాఖల మధ్య సమన్వయం, కీలక ఫైళ్ల పరిష్కారంలో గతంలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు తగ్గిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
కొత్త సీఎస్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై తమ అభిప్రాయాలు పూర్తిగా ప్రతిబింబించడం లేదని కొందరు అధికారులు భావిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో పరిపాలనలో అవసరమైన టీమ్ వర్క్ కొంత దెబ్బతింటోందా? అనే చర్చ కూడా సచివాలయంలో జరుగుతున్నది.
సెంట్రల్ సర్వీస్ నుంచి..
సంజయ్ జాజు గత దాదాపు పన్నెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, అమలు, జాతీయ స్థాయి పరిపాలనలో ఆయనకు విశేష అనుభవం ఉంది. అయితే రాష్ట్ర పరిపాలన మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జిల్లాల వారీగా స్థానిక సమస్యలు, ప్రాంతీయ రాజకీయాలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, శాఖల మధ్య సంబంధాలు వంటి అంశాలపై పూర్తిస్థాయి పట్టు సాధించడానికి కొంత సమయం అవసరమవుతుందని మాజీ అధికారులు చెబుతున్నారు.
ఈ దశలో రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారుల అనుభవం, మార్గదర్శకత్వం, సహకారం కొత్త సీఎస్‌కు అత్యంత కీలకంగా మారుతుందని పరిపాలనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సీఎస్‌కు సీనియర్ అధికారుల నుంచి ఎంతో సహకారం అవసరం. కానీ ఆ మేరకు వారి నుంచి సహకారం లభించడం లేదని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పరిణామం రాష్ట్ర పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపనున్నదని సచివాలయ వర్గాల్లో అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వానికి కూడా సవాలే...
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు వంటి అనేక కీలక కార్యక్రమాలను ఒకేసారి అమలు చేస్తోంది. ఇలాంటి సమయంలో సీఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, శాఖల కార్యదర్శులు ఒకే దిశగా పనిచేయడం అత్యంత అవసరం. పరిపాలనలో చిన్నపాటి సమన్వయ లోపం కూడా నిర్ణయాల వేగం, ఫైళ్ల క్లియరెన్స్, ప్రాజెక్టుల అమలుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని మాజీ బ్యూరోక్రాట్లు గతంలో పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు.
దీంతో ప్రభుత్వ పరిపాలన ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణపై సందిగ్ధత నెలకొనే అవకాశాలున్నాయి. ప్రస్తుతం విస్తృతంగా జరుగుతున్న ఈ ప్రచారం సద్దుమణుగుతుందా?, కొత్త సీఎస్ సొంత టీంను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తారా?, సీనియర్ అధికారులు కూడా ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలులో మరింత చురుకైనపాత్ర పోషిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీఎస్‌కు ఎక్కువ పదవీ కాలం ఉండటం సబబైనా, ఇదే అంశం సీనియర్ అధికారుల్లో అసంతృప్తి.. సచివాలయంలో చర్చలకు కేంద్రబిందువుగా మారింది.






