పార్లమెంటులో నిరసనల హోరు
- తొలిరోజు వర్షాకాల సమావేశాలు గందరగోళం
- ఆరంభం నుంచే విపక్షాల ఆందోళన
- సీజేపీ ర్యాలీ, లాఠీఛార్జ్‌పై చర్చ జరగాలని పట్టు
- నీట్ లీకేజీ, రామ్‌మందిర్ నిధుల దుర్వినియోగంపైనా చర్చకు డిమాండ్
- లోక్‌సభ నాలుగు సార్లు, పెద్దలసభ ఆరుసార్లు వాయిదా
న్యూఢిల్లీ, జూలై ౨౦: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన తొలిరోజే ఉభయసభల్లో గందరగోళం ఏర్పడింది. లోక్‌సభ ప్రారం భం కాగానే స్పీకర్ ఓంబిర్లా సభ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించారు. సభ్యులు అర్థవంతమైన చర్చ లేవనెత్తాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలే ధ్యే యంగా సభ్యులు ప్రసంగించాలని విజ్ఞప్తి చేశారు. విపక్ష సభ్యులు కలుగజేసుకుని, ప్రశ్నపత్రాల లీకేజీ, పార్లమెంట్ వద్ద విద్యార్థుల నిరసన, అయోధ్య రామాలయం నిధుల దుర్వినియోగంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీలు హిబీ ఈడెన్, మనీష్ తివారీ వాయిదా తీర్మానాలిచ్చారు. నీట్ అవకతవకలు, ఫిరాయింపుల నిరోధక చట్టంపై చర్చించాలని పట్టుబట్టారు. సభలో రసాభాసగా మారడంతో స్పీకర్ సభను మధ్యా హ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైనా సభ సజావుగా సాగలేదు. ఒకదశలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. సభను సజావుగా సాగనివ్వాలని విపక్షాలను కోరారు.
అయినప్పటికీ విపక్షాలు తగ్గలేదు. తాము కోరిన అంశాలపై చర్చ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశాయి. స్పీకర్ మళ్లీ మధ్యాహ్నం ఒంటిగంటకు, ఆ తర్వాత 2:30 గంటలకు, చివరకు 3 గంటలకు వరుసగా సభను వాయిదా వేయాల్సి వచ్చింది. మొత్తంగా లోక్‌సభ నాలుగు సార్లు వాయిదా పడి చివరకు ఆ రోజు సెషన్ ముగిసింది.
రాజ్యసభలోనూ అదే తీరు
లోక్‌సభలో గందరగోళం ఏర్పడినట్లే రా జ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. చైర్మ న్ సీపీ రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను నిర్వహించడానికి చేసిన ప్రయ త్నాలేవీ ఫలించలేదు. నీట్ అవకతవకలు, అయోధ్య రామమందిర నిధుల దుర్వి ని యోగం, ఫిరాయింపుల నిరోధక చట్టంపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో వెల్‌లోకి దూసుకువెళ్లారు. కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్‌హుస్సేన్ వాయిదా నోటీసు ఇచ్చారు.
రామాలయ నిధుల దుర్వినియోగంపై చర్చ జరగాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించారు. నిధుల మళ్లింపుపై స్వతంత్ర విచారణ జరిపించి, పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌ను ఎత్తుకుని ఇతర విపక్ష సభ్యులు కూడా ఖర్గేను సమర్థించారు. ఈ క్రమంలో సభలో గందరగోళం ఏర్పడింది. ఇలా సభ మొత్తం ఆరు సార్లు వాయిదా పడింది. చివరకు చైర్మన్ మధ్యాహ్నం 2:35 గంటలకే సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.
నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడట్లేదు: ప్రధాని మోదీ
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. వర్షాకాల సమావేశాలు సజావుగా, ఫలప్రదంగా సాగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే, స్కైరూట్ ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగం విజయవంతంపై ప్రధాని మాట్లాడారు. ప్రయోగంలో భాగస్వాములైన వారంతా 28 ఏళ్ల వయస్సులోపు వారేనని, తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చే శారు.
భారత్ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం వృద్ధితో దూసుకుపోతున్నదని హర్షం వ్య క్తం చేశారు. స్టార్టప్స్ రంగంలోనూ దేశం ముందుందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి సారి హైడ్రోజన్ రైలు సేవలను సైతం ప్రారంభించామని గుర్తుచేశా రు. గడిచిన నెల రోజుల్లో భారత్ అపూర్వమైన విజయాలు సాధించిందని కొని యాడారు.






