27 June, 2026 | 1:13 AM

అవగాహనతోనే మాదకద్రవ్యాల నియంత్రణ

27-06-2026 12:04 AM

మంచిర్యాల టౌన్, జూన్ 26 : అవగాహన కల్పించడం ద్వారానే యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా, మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ నాయుడు అన్నారు. శుక్ర వారం డీఎం అండ్ హెచ్‌ఓ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవాన్ని పురష్కరించుకొని అవగాహన కల్పించే వాల్ పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

జిల్లాలోని అన్ని పీహెచ్సీ, సీహెచ్సీ, యూపీహెచ్సీ, బస్తీ దవాఖానాలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, ఆశ ఆరోగ్య కార్యకర్తలు మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా యువతకు అవగాహన కలిగించాలని కోరారు. మత్తు పదార్థాలు తీసుకోవడం, డ్రగ్స్ వాడడం వలన శరీరంలోని మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయము, రక్తం సరఫరా చేసే గుండె తదితరాలు పాడవుతాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చూడాలన్నారు.

జిల్లాలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నిపుణుల ద్వారా ఉచిత కౌన్సిలింగ్ కోసం టెలీమానస్ (14 416 నంబర్) ద్వారా మానసిక ఒత్తిడి ఉన్నవారు ప్రత్యేక వైద్య నిపుణుల సహాయకారాన్ని, వైద్య సాయాన్ని పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సునీల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.