17 April, 2026 | 2:11 AM

రావు బహదూర్.. దర్శకుడి సినిమా

17-04-2026 12:00 AM

మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ప్రముఖ దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

టీమ్ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ని రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. “ఓ సుందరి’ పాట మహిళలను సెలబ్రేట్ చేసేలా ఉంటుంది. బాహుబలి, అవతార్ లాంటి సినిమాలు ఆ స్కేల్లో ఎలా అయితే ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగాయో మా రావు బహుదూర్ కూడా అంతే స్థాయిలో అలరిస్తుంది. వెంకటేశ్ మహా దేశం మొత్తం తిరిగి ఈ కథ రాశాడు. సినిమా చూసి ప్రేక్షకులు మహాను సెలబ్రేట్ చేస్తారు” అని చెప్పారు.

‘ఇది నాకు గోల్డెన్ అవకాశం’ అని హీరోయిన్ దీప థామస్ తెలిపారు. దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ.. “దాదాపు ఐదేళ్ల తర్వాత నా సినిమాకు జరుగుతున్న తొలి ఈవెంట్ ఇది. ఈ సినిమా ప్రాసెస్‌కు ఐదేళ్లు పట్టింది. ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ సినిమా ఇచ్చిన అనుభూతికి పది రెట్లు అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ‘రావు బహదూర్’ తీశా” అని తెలిపారు. ‘ఈ సినిమా గొప్ప థియేట్రికల్ అనుభూతి ఇస్తుందని’ నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్‌చంద్ర, గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో, సంగీత దర్శకుడు స్మరణ్ సాయి, గాయకుడు విజయ్ యేసుదాస్ తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.