24 June, 2026 | 7:09 PM

భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి

24-06-2026 05:50 PM

- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నెన్నెల మండలం పుప్పల్వానిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన భూ సర్వే అవగాహన సదస్సుకు ఎ.డి.ఎస్.ఎల్.ఆర్. శ్రీనివాస్, మండల తహసిల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి హై లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులతో సరిచూసి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూ సర్వే చేపట్టి ఆయా బ్లాక్ లకు పన్ను విధించడం జరుగుతుందని తెలిపారు. భూ సర్వే సమర్ధవంతంగా చేపట్టడం జరుగుతుందని, ఒకసారి తప్పు జరిగితే సవరించడానికి సమయం పడుతుందని తెలిపారు.

పట్టాదారులు తమ భూములకు సంబంధించి హద్దులను సమగ్రంగా చేసుకోవాలని, రికార్డుల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో మోకా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.దరఖాస్తుదారులు సరైన పత్రాలతో సర్వేలో పాల్గొనాలని, అర్హులైన వారికి మాత్రమే సర్వే ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల పరిశీలనలో బోగస్ ఉన్న వాటిని రద్దు చేయడం జరుగుతుందని, వివాదాలలో ఉన్న భూములను న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సర్వే సమగ్రంగా జరిగినట్లయితే భవిష్యత్తులో భూమి వివాదాలకు అవకాశం లేకుండా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. 

అంతకుముందు మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి విధులలో సమయపాలన పాటించాలని సూచించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మండలంలోని కొన్నంపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను సందర్శించి అధికారులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.