బీఆర్‌ఎస్ హయంలో చెరువులన్నీ కబ్జా
ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెరువులను కబ్జా చేసిండు
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
ఎల్బీనగర్, జూన్ 24 : బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో చెరువులన్నీ కబ్జాలకు గురయ్యాయని, ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అనుచరులతో చెరువుల స్థలాలను కబ్జా చేయించాడని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ విమర్శించారు. బుధవారం అధికారులు, నాయకులతో కలిసి బైరామల్ గూడ చెరువును సందర్శించారు.
చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. స్థానికులు ఈ సందర్భంగా పలు సమస్యలు వివరించగా.. వాటిని పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించాలని మధుయాష్కి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బైరామల్ గూడా చెరువు ఆరు ఎకరాలకు పైగా విస్తరించి ఉండగా, కబ్జాలకు గురై ఇప్పుడు రెండు ఎకరాలే మిగిలిందన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కబ్జాకోరు తనంతోనే చెరువులు కుంచించుకుపోయాయని ఆరోపించారు.
అక్రమణలను వదిలిపెట్టేది లేదని, హైడ్రా కు పిర్యాదు చేస్తామన్నారు. కబ్జాలకు గురైన చెరువు స్థలాలను ప్రభుత్వ యంత్రాంగం స్వాధీనం చేసుకుంటుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి కృషి చేస్తుందని, బైరామల్ గూడా చెరువు వద్ద రూ. 2.60 కోట్లతో సుందరీ కరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చెరువు అభివృద్ధికి మొత్తం 10 కోట్లు మంజూరు కానున్నాయని పేర్కొన్నారు.
బైరమల్ గూడ చెరువు పైనుంచి వచ్చే వరద నీటిని నేరుగా సరూర్నగర్ చెరువులోకి వెళ్లేందుకు పనులు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామన్నారు. దీని ద్వారా చెరువు పరిసర కాలనీలకు ముంపు సమస్య తీరుతుందన్నారు. అనంతరం బైరామల్ గూడలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు. పాతబడిన గదులను పరిశీలించారు. నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
తాత్కాలికంగా రిపేర్లు చేసి విద్యార్థులకు ఇబ్బందులు తొలగించేలా చూడాలని అక్కడికి వచ్చిన నాయకులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యుటీ కమిషనర్ శ్రీనివాస్, ఈఈ కార్తీక్, జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్ గౌడ్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, కుట్ల నర్సింహా యాదవ్, వేణుగోపాల్ యాదవ్, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.






