అభివృద్ధిని అడ్డుకునే కుయుక్తులు మానుకోండి
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓర్చుకోలేక కొంతమంది బిఆర్ఎస్ నాయకులు అభివృద్దిని అడ్డుకునే కుయుక్తులు చేస్తున్నారని పట్టణ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. చెన్నూర్ మున్సిపాలిటీలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రతి వార్డులో ఉన్న గల్లీల్లో సిమెంటు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, కొన్ని వార్డులలో పనులు కూడా పూర్తయ్యాయని, ప్రతివార్డుకు సోలార్ హైమాస్ లైట్లు కూడా బిగించడం జరిగిందన్నారు.
పట్టణంలో త్వరలో వంద పడకల ఆసుపత్రి కూడా ప్రారంభం కాబోతుందని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చెన్నూర్ మున్సిపల్ పట్టణం అంబేద్కర్ చౌక్ నుంచి కోటపల్లి బస్ స్టాప్ రావిచెట్టు వరకు 60 ఫీట్ల రోడ్డు వెడల్పులో భాగంగా పనులు చేపట్టడం జరిగిందన్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి షాపులను వారే స్వచ్ఛంగా తొలగించుకున్నారని, కానీ కొందరు బిఆర్ఎస్ నాయకులకు అది మింగుడు పడక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచన మేరకు రహదారి వెంబడి తిరుగుతూ వ్యాపారస్తులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు.
కానీ వ్యాపారస్తులే స్వచ్ఛందంగా తొలగించడం చూసి ఏం మాట్లాడలో తెలియక వెనుతిరిగారన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎలాంటి నోటీసులివ్వకుండా కేవలం తన నిద్రకు భంగం కలుగుతుందని చెప్పి క్యాంప్ ఆఫీస్ కార్యాలయం ముందు ఉన్న చిరు వ్యాపారస్తుల దుకాణాలు తీయించిన ఘనత అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ దక్కుతుందని విమర్శించారు. ఎన్నికలలో అంబేద్కర్ విగ్రహం నుంచి చూస్తే చెరువు కట్ట కనపడాలని చెప్పిన ఈ బాల్క సుమన్ మరి అప్పుడు రోడ్డు వెడల్పు కార్యక్రమం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
అప్పుడు కేవలం వ్యాపారస్తుల ప్రలోభాలకు లొంగి రోడ్డు వెడల్పు కార్యక్రమం రద్దు చేసుకున్నాడని, ప్రముఖ దినపత్రికలు కూడా వార్తల రావడం జరిగిందని గుర్తు చేశారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ చేసే బాల్క సుమన్ అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మరి ఈరోజు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి నోటీస్ ఇవ్వలేదని చెప్పిన మాజి జెడ్పి వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి మరి అతను ఏ నోటీసులిచ్చి వ్యవసాయం చేసుకొని బతికే మహంకాళి వాడ రైతుల ఇల్లులు కూలగొట్టాడని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో కబ్జా చేయమని చెప్పిన బాల్క సుమన్ అనుచరులు వెళ్లి విద్యుత్ సిబ్బంది మీద దాడి చేసింది నిజం కాదా... ఇలాంటి రౌడీ రాజకీయాలు చేసే అవసరం మా మంత్రి వివేక్ కి లేదన్నారు. వ్యాపారస్తులతో మూడు దఫాలు చర్చించిన అనంతరమే ప్రతి ఒక్క వ్యాపారస్తునికి నోటీసు ఇచ్చిన అనంతరం రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించామన్నారు.






