07-02-2026 12:54:05 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి నివాసంలో శుక్ర వారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భేటీ అయ్యారు. సీఎం తన విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఐదురోజుల తర్వాత వీరు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సీఎం రేవంత్ ఇటీవల మంత్రివర్గంతో భేటీ కాగా, ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి మరో పర్యటనలో ఉండి హాజరు కాలేదు.
డిప్యూటీ సీఎం ఈ నేపథ్యంలోనే సీఎంతో భేటీ అయ్యారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తాజా భేటీలో వీరు ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించే ప్రచార వ్యూహాలు, సింగరేణి నైని బ్లాక్ టెండర్ల అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. సీఎం దగ్గరి బంధువుతోపాటు డిప్యూటీ సీఎం భట్టికి అనుకూలమైన వారికి టెండర్లు దక్కే విధంగా నిబంధనలు పెట్టారని ఆరోపణలు వచ్చిన సమయంలో సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు.
ఈ అంశంపైనే ప్రధానంగా సీఎం, డిప్యూటీ సీఎం చర్చించినట్లు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిసింది. అలాగే మున్సిపల్ ఎన్నికలపైనా చర్చించినట్లు సమాచారం. పార్టీ గ్రాఫ్ తక్కువగా ఉన్న వార్డులు, డివిజన్ల పై మంత్రులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడినట్లు బోగట్టా. సీట్లు తగ్గితే రాష్ట్రప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉందనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు ఎత్తుకుంటాయని, వారికి ఆ అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలనే అంశంపై ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది.