11 July, 2026 | 2:27 AM

ఎన్‌జీకాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తీరుపై విమర్శలు

11-07-2026 01:33 AM

సంతకాల కోసం విద్యార్థులు, సిబ్బంది పడిగాపులు

నల్లగొండ టౌన్, జూలై 10: జిల్లా కేంద్రంలోని ప్రతిష్టాత్మక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వ్యవహార శైలిపై విద్యార్థులు, సిబ్బంది విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలకు ఇన్చార్జి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కువ సమయం హైదరాబాద్ లో ఉన్నత విద్యా కమిషనరేట్ కార్యాలయంలోనే ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కళాశాలలో సంతకాల కోసం విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘాలు సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.

స్కాలర్షిప్లు, బిల్లులు ఆలస్యం..

కళాశాలకు సంబంధించిన స్కాలర్షిప్ బిల్లులకు, ఇతర ఆర్థిక బిల్లులకు అడ్మినిస్ట్రేషన్ అధికారి సంతకం తప్పనిసరి కావడంతో, బిల్లులపై సంతకాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అధికారి అందుబాటులో లేకపోవడంతో స్కాలర్షిప్లు సకాలంలో విద్యార్థులకు అందడం లేదు. సంతకం కోసం హైదరాబాద్ కమిషనరేట్కు వెళ్లినా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని, లంచం ఇస్తేనే సంతకం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా డబ్బులు ఇస్తేనే ఫైల్ పై సంతకం పెడుతుంది అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

లంచం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు సిబ్బంది మదన పడుతున్నారు. ఇటీవల కళాశాల నాన్ టీచింగ్ సిబ్బంది ఆ అధికారి వ్యవహారంపై ఉన్నత విద్యా కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కళాశాల సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తూ, విద్యార్థులకు అందుబాటులో లేని ఇటువంటి అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు సిబ్బంది కోరుతున్నారు. కళాశాలలో అందుబాటులో ఉండి విద్యార్థుల సమస్యలు పరిష్కరించే అధికారిని నియమించాలని, స్కాలర్షిప్లు, కళాశాలకు సంబంధించిన బిల్లులు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.