ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీఆర్‌ఎస్ నాయకుల లక్ష్యం
కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం
కాళేశ్వరం కాదు& అది కూలేశ్వరం
బిల్లా-రంగా తరహాలో బావబామ్మర్దుల రాజకీయ డ్రామాలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు
సూర్యాపేట జూలై 10 (విజయక్రాంతి): సవ్యంగా పాలన కొనసాగిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని బధనం చేయడమే బిఆర్‌ఎస్ నాయకుల లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు.
సుమారు రూ.8.20 లక్షల కోట్ల మేర ఆర్థిక విధ్వంసం సృష్టించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాలన సాగిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు జీతాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుతం ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు చెల్లించడమే కాకుండా పెండింగ్ బకాయిలను కూడా క్లియర్ చేస్తోందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌ఎస్ నేతలు ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. రూ.1.27 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీరు వచ్చేదని తెలిసినా, అంచనాలు పెంచి భారీ కమీషన్ల కోసం మేడిగడ్డ వద్ద నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా మార్చిన ఘనత వారిది అన్నారు.
50 టీఎంసీల నీటిని కూడా ఎత్తిపోసే సామర్థ్యం లేకపోయినా వేల కోట్ల అప్పులు రాష్ట్ర ప్రజలపై మోపారన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ను పూర్తిస్థాయిలో నింపితే పరిసర గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. హరీష్ రావు, కేటీఆర్ లు ఇద్దరూ బిల్లా-రంగా తరహాలో పోటీ పడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. మూడు వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేస్తానని చెప్పే హరీష్ రావు, గత తొమ్మిదేళ్లలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబం వేల ఎకరాల ఫామ్ హౌస్లు ఎలా సంపాదించిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో 3,000 ఇందిరమ్మ ఇళ్లను రూ.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. సూర్యాపేటకు కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చాయని జగదీశ్ రెడ్డి చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, వాస్తవానికి జలయజ్ఞం కింద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారానే ఈ ప్రాంతానికి సాగునీరు అందిందని స్పష్టం చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు






