11 July, 2026 | 3:05 AM

రాములోరి మీద ఆన.. రాసిపెట్టుకో కేసీఆర్ మాకు 117 సీట్లు పక్కా

11-07-2026 02:20 AM

ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్.. బీఆర్‌ఎస్‌ను మొలకెత్తనీయం

కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలే పాతాళానికి తొక్కుతారు

  1.    2029 జూన్‌లోనే సాధారణ ఎన్నికలు
  2. రాహుల్‌ను ప్రధానిని చేస్తాం
  3. రైతు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం 
  4. ఉచిత కరెంట్‌కు కట్టుబడి ఉన్నాం
  5. కాళేశ్వరంపై రాజకీయాలు మానండి 
  6. రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్‌రెడ్డి

* ఒకే ఇంట్ల రెండు గుంపులు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు. ఒక రిపై పోటీగా ఇంకోకాయన.. కన్నెపల్లికి పోయి పంపులు ఆన్ చేయాలం టాడు. ఒకసారి మేడిగడ్డ కుంగితేనే ఇంత నష్టం జరిగింది. మళ్లీ నీళ్లు నింపితే భద్రాచలం రాముడు మునుగుతాడు. ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోయాయి. దుర్మార్గుడా.. నీ దుష్ట రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలా అని అడిగితే సమాధానం లేదు.

* రేవంత్‌రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందని దుష్ప్రచారానికి దిగారు.  ఎన్నికలు ఎప్పుడో తెలియకుండా, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియకుండా ఎవరైనా సర్వేలు చేస్తారా. గెలుపు ఓటములు నిర్ణయిస్తారా? 

 సీఎం రేవంత్‌రెడ్డి

ఖమ్మం, జులై 10 (విజయక్రాంతి): ‘ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్.. రాబోయే అసెంబీ ఎన్నికల్లో 117 స్థానా లు గెలుచుడు ఖాయం. భద్రాద్రి రాములోరి మీద ఆన.. రాసి పెట్టుకో కేసీఆర్. బీఆర్‌ఎస్‌ను అథఃపాతాళంలోకి తొక్కుతాం.. మొలకెత్తనీయం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలోని జగన్నాథపురంలో శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే.. ఖమ్మం జిల్లా గుండెకాయలాంటిది. 2023 జూలైలో పొంగులేటి చేరిక సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఉప్పెనలా వచ్చి బీఆఆర్‌ఎస్‌ను బొందపెట్టిండ్రు. సరిగ్గా ఇప్పుడు అదే జూలైలో బీఆర్‌ఎస్‌ను మళ్లీ మొలకెత్తనివ్వబోమని చింతకాని సభకు వేలా దిగా తరలివచ్చారు. మీకు అభినందనలు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు మొదులకొని ప్రతీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని  ప్రజలు గెలిపిస్తున్నారని, పాపలా భైరవున్ని ఫామ్‌హౌస్‌లోనే లోనే బందీ చేశారని పేర్కొన్నారు.

జరగబోయే కురుక్షేత్రంలో కౌరవ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబర్‌లో జరగవని, 2029 మే లేదా జూన్ మాసంలో జరుగుతాయని స్పష్టం చేశారు.  తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు 26కు, 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయన్నారు. 

36 నెలల ముందుగానే వచ్చే ఎన్నికల ఫలితాల జోస్యం చెబుతున్నా.. 182 అసెంబ్లీ స్థానాల్లో 117 సీట్లు గెలిచి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం రాములవారి మీద ఆన, ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట.. రాస్కో చంద్రశేఖర్‌రావు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలు గుర్తు పెట్టుకోండి.. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తామని చెప్పారు. ప్రతీ సందర్భంలో ప్రజాప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు..

‘ఒకే ఇంట్ల రెండు గుంపులు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు. ఒకరిపై పోటీగా ఇంకోగాయన కన్నెపల్లికి పోయి పంపులు ఆన్ చేయాలంటాడు. ఒకసారి మేడిగడ్డ కుంగితేనే ఇంత నష్టం జరిగింది. మళ్లీ నీళ్లు నింపితే భద్రాచలం రాముడు మునుగుతాడు. ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోయాయి దుర్మార్గుడా. నీ దుష్ట రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలా అని అడిగితే సమాధానం లేదు. అని కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి విమర్శలు చేశారు.

రేవంత్‌రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందని దుష్ప్రచారానికి దిగారు.  ఎన్నికలు ఎప్పుడో తెలియకుండా, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియకుండా ఎవరైనా సర్వేలు చేస్తారా. గెలుపు ఓటములు నిర్ణయిస్తారా?’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో ఇలాగే చెబితే జనం బీఆర్‌ఎస్‌ను బండకేసి కొట్టారు. బ్యాండుమేళం బ్యాచ్‌లా బీఆర్‌ఎస్ సర్వేల బ్యాచ్ తయారైంది.  బీజేపీలోకి వెళ్లనని హరీశ్‌రావు కేసీఆర్‌పై ఒట్టేసి చెప్పాలి.

నువ్వు ఎక్కడుంటావో తెలియదు.. మీ బావ ఎటు పోతడో తెలియదు.. అని రేవంత్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని నీ సొంత చెల్లెలే చెబుతోంది. ఆంధ్ర కాంట్రాక్టర్లు బీఆర్‌ఎస్‌కు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని నీ సొంత చెల్లే చెప్పింది. బీఆర్‌ఎస్ అమలు చేసిన షాదీ ముబారక్, రైతుబందు పథకాలను మేం కొనసాగించడం లేదా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతీ పేదవాడికి రేషన్‌కార్డు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని వివరించారు.   

రాత్రి పబ్బులు.. పగలు రైతు సంక్షేమమా?

రైతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ప్రజాప్రభుత్వం వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యమిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుభరోసా ఎకరానికి రూ.12 వేలకు పెంచాం, రైతులను రుణ రుణవిముక్తులను చేశామని చెప్పారు. సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ‘ఒకాయన సాయంత్రం అయిందంటే పబ్బుల్లో గడుపతడు.

పొద్దున్నే లేచి గబ్బు పనులు చేస్తడు’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. రాత్రిళ్లు పబ్బులకు తిరిగి, పగలు రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. ‘హరీశ్‌రావు తాటి చెట్టంత పెరిగాడు. కానీ, తలకాయలో గుజ్జు లేదు. అడ్డగోలుగా మాట్లాడుతున్నడు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

సీఎంను సన్మానించిన కాంగ్రెస్ నేతలు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాసు నాయక్, మట్టా రాఘమయి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య సీఎంను ఘనంగా సన్మానించారు. వెంకటేశ్వరస్వామి విగ్రహం బహూకరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతాం:  డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా, ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా, పారదర్శకమైన పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా మారుస్తామని స్పష్టం చేశారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఉద్ఘాటించారు. ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రెండున్నర సంవత్సరాల్లోనే సుమారు 67 వేల కోట్ల రూపాయలను మహిళలకు అందించామని ఆయన వెల్లడించారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది, వారిని కోటీశ్వరులుగా చూడటమే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

వ్యవసాయాన్ని కేవలం ఒక వృత్తిగా కాకుండా మన సంస్కృతిగా, జీవన విధానంగా భావిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఎకరానికి 12 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గత రెండున్నరేళ్లలోనే వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి మరో రూ.1009 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశారని చెప్పారు.

రుణమాఫీ కింద రూ. 21 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడమే కాకుండా, సివిల్ సప్లై శాఖ ద్వారా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా సుస్థిరంగా ఉంటే, లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేక విఫలమైందని విమర్శించారు. రూ. 27 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును రూ. 1,40,000 కోట్లకు పెంచి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుప్పకూలేలా చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

అవినీతి సొమ్ముతో మీడియా సంస్థలను కొని, తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అభివృద్ధి బాటలో పయనిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆసరాగా చేసుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని నేతలు ఆరోపించారు.

బీఆర్‌ఎస్ నేతల మాటలను నమ్మితే రాష్ట్రం మళ్లీ సర్వనాశనం అవుతుంది‘ అని  హెచ్చరించారు. అభివృద్ధిని అడ్డుకుంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారిని గ్రామాల్లోకి రాకుండా నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వం గాలికి వదిలేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ‘రాజీవ్ కెనాల్’గా ప్రత్యేకంగా డిజైన్ చేసి, వంద కోట్ల పైగా నిధులతో పనులు వేగవంతం చేశామని నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని బీఆర్‌ఎస్ నాయకులు ఫాంహౌస్లకే పరిమితమై, తమ అనుచరులతో అబద్ధపు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

రైతు సంక్షేమ ప్రభుత్వం మాది: మంత్రి తుమ్మల

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 నెలల్లో 36 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. లక్షా అరవై వేల కోట్లు రైతాంగం కోసం ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. అత్యధిక ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు.

ఎంఎస్పీ ధరకే ప్రకటించి కేంద్రం సహకరించకున్నా అన్ని పంటలు కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కొనియాడారు. రాజీవ్ లింక్ కెనాల్ తో సాగర్ ఆయకట్టు కు గోదావరి నీళ్లు అందిస్తున్నామని తెలిపారు.  యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి ఆగస్ట్ 15 నాటికి సత్తుపల్లి కి గోదావరి నీళ్లు ఇస్తామని తెలిపారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేసి పాలేరు కు గోదావరి నీళ్లు అందించి తీరుతామని కోరారు. 

భూభారతితో సరికొత్త భూ విప్లవం: మంత్రి పొంగులేటి

‘భూభారతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భూమినీ సర్వే చేసి, సాగులో ఉన్న ప్రతి రైతుకు మ్యాప్తో కూడిన ‘భూదార్’ కార్డును అందజేస్తాం’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూభారతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.

పైలట్ ప్రాజెక్ట్ కింద మధిర నియోజకవర్గంలోని ముల్గుమాడ్ రెవెన్యూ గ్రామంలో సర్వే పూర్తి చేసి, సుమారు 476 మంది రైతులకు మ్యాప్లతో కూడిన భూదార్ కార్డులను సిద్ధం చేశామన్నారు. ఈ సభా వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా రైతులకు ఈ కార్డులను పంపిణీ చేసినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఇదే పద్ధతిలో కార్డులు ఇస్తామని మంత్రి ప్రకటించారు.

నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు మొదటి రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 71 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, రాబోయే కొద్ది రోజుల్లోనే మరో 17 వేల నుంచి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని సగర్వంగా ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి పిల్లర్‌లోనూ గత పాలకుల అవినీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపించారు.

నీటిపారుదల శాఖపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని, అబద్ధాల ప్రచారం మానుకోకపోతే ప్రజలు రాబోయే రోజుల్లోనూ తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే రేవంత్ అన్న నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. 

రైతు ఆశీర్వాద సభ హైలెట్స్..

* చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు

* మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చింతకాని సభా వేదిక వద్దకు బయలుదేరారు.

* మధ్యాహ్నం 2.51 గంటలకు హైదరాబాద్ నుంచి ఖమ్మంకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మిగిలిన మంత్రులు హెలికాప్టర్‌లో బయలుదేరారు.

* మధ్యాహ్నం 3.15 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెలిప్యాడ్ వద్దకు వచ్చారు.

* మధ్యాహ్నం 3.54 గంటలకు హెలికాప్టర్ వద్దకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు

* సభా వేదికకు చేరుకున్న సీఎంకు జననీరాజనాలతో స్వాగతం పలికిన ప్రజలు

* 40 నిమిషాలపాటు ప్రసంగించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

* రైతు భరోసా చివరి దపా నిదులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు

* 25 నిమిషాలు ప్రసంగించిన సీఎం రేవంత్‌రెడ్డి 

* ప్రసంగం అనంతరం రైతులకు చెక్కులు, పాస్ బుక్స్ పంపిణీ

* రెండు లక్షల మందికి పైగా రైతులు, ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు 

* వందలాది బస్సులు, ఆటోలు, బైకులపై తరలివచ్చారు

* బోనకల్ రోడ్డు వద్ద గంటపాటు ట్రాఫిక్ జామ్ 

* ఖమ్మం సీపీ సునీల్ దత్ ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు

20 ఎంపీ స్థానాలు గెలిపిద్దాం..

నా ఆశ, భట్టి ఆశ, క్యాబినెట్.. వీరందరి కోరిక రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమేనని అన్నారు. రాహుల్‌ను ప్రధానమంత్రిని చేద్దామా, చేద్దామా.. అని సీఎం ప్రజలను అడిగారు. 

హరీశ్‌రావుకు రేవంత్ ఫోబియో పట్టుకున్నది 

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : హరీశ్‌రావుకు రేవంత్ రెడ్డి ఫోబియో పట్టుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. రేవంత్‌కి పిచ్చి అంటుం టున్నాడని, అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకే నని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హంతకులు లేచి సంతాపసభ పెట్టిన ట్లుగా బీఆర్‌ఎస్ నాయకులు తీరు ఉందన్నారు. గతంలో ఆంధ్ర సెంటిమెంట్ ను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని, ఇప్పుడు కూడా రెచ్చగొట్టాలని చూస్తే కుదరదన్నారు. బీఆర్‌ఎస్ దోచుకున్న రూ. 1400 కోట్ల పార్టీ ఫండ్‌ను అమరవీరులు కుటుంబాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.