11 July, 2026 | 3:05 AM

విత్తన చట్టం ఇంకెప్పుడు?

11-07-2026 02:05 AM

నెలలు గడుస్తున్నా ముందుకు కదలని ఫైళ్లు

  1. నకిలీ విత్తనాలతో ప్రతి ఏటా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం 
  2. కార్పొరేట్ శక్తుల నుంచి రక్షణ కల్పంచాలి: రైతులు
  3. విత్తనచట్టం, ఆదర్శ రైతు ఉండాలని..
  4. ప్రభుత్వానికి రైతు కమిషన్ నివేదిక
  5. పెండింగ్‌లోనే విత్తన ముసాయిదా బిల్లు
  6. రైతు కమిషన్ సిఫార్సులపైన స్పందించని సర్కార్ 
  7. విత్తన చట్టానికి తుదిరూపు ఇవ్వాలని కోరుతున్న రైతులు 

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): కల్తీ విత్తనాల వల్ల ప్రతి ఏటా లక్షలాది ఎకరాలలో పంట నష్ట జరుగుతోంది. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. అంతే కాకుండా ప్రైవేట్ కంపనీలు విచ్చలవిడిగా విత్తన ధరలను పెంచుకుంటున్నాయి. గత మూడు దశాబ్దాలలో విత్తనోత్పత్తి , విత్తన సరఫరా, అమ్మకాల రంగంలో ప్రైవేట్ కంపనీలు వందలాదిగా వచ్చాయి. విదేశీ, స్వదేశీ బహుళ జాతి కంపనీలు ఈ రంగంలోకి ప్రవేశించాయి.

ఈ ప్రైవేట్ కంపనీలకు తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారింది. దేశానికి కావలసిన అనేక పంటల విత్తనాలను రాష్ట్రం ఉత్పత్తి చేస్తోంది. అందుకు తెలంగాణను దేశానికే ‘విత్తన భాండాగారం’ అని పిలుచుకుంటాం. కానీ, అదే భాండాగారానికి గట్టి భద్రతనిచ్చే రెండు కీలకమైన అంశాలు ఇప్పుడు సచివాలయంలోని ఫైళ్లకే పరిమితమయ్యాయి.

రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, విత్తన రైతులను మల్టీనేషనల్ కంపెనీల దోపిడీ నుంచి రక్షించాల్సిన ‘విత్తన ముసాయిదా బిల్లు’తోపాటు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలవాల్సిన ‘ఆదర్శ రైతు’ పునరుద్ధరణ అంశంపై నెలలు గడుస్తున్నా సర్కార్ నుంచి మోక్షం లభించడం లేదు. ఈ విత్తన చట్టానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఎప్పుడిస్తుందా..? అని రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రం నుంచే వివిధ రాష్ట్రాలకు విత్తనాలు సరఫరా

విత్తన భాండాగారంగా పేరుగాంచిన తెలంగాణ నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాలకు విత్తనాలు సరఫరా అవుతున్నాయి. వరి, పత్తితో పాటు ఇతర పంటల విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ విత్తన ఉత్పత్తిని ఎక్కువగా ఆదివాసి ఏరియాల్లో సాగుచేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీలతో పాటు ఇతర రాష్ట్రాలు ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన కొన్ని కంపెనీలు సైతం విత్తనసాగును చేయిస్తున్నాయి.

రాష్ట్రంలో విత్తన చట్టం లేకపోవడంతో విత్తనసాగుచేసిన రైతులకు ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు సైతం అందాయి. దానిపై రైతు కమిషన్ సైతం సీరియస్ కావడంతో పాటు వారికి కంపెనీల నుంచి పరిహారం సైతం ఇప్పించింది. ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే మల్టీనేషనల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం, రైతులకు పరిహారం ఇప్పించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో వరి హైబ్రిడ్ విత్తనం 1.2లక్షల ఎకరాల్లో 48వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. హైబ్రిడ్ కాకుండా సాధారణ వరి విత్తనాలను రాష్ట్రంలో 4.5లక్షల ఎకరాల్లో 1.5లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. అదేవిధంగా మొక్క జొన్న విత్తనాలను 1.25లక్షల ఎకరాల్లో 31 వేల మంది రైతులు, మిల్లెట్స్ 5వేల ఎకరాల్లో 24వేల మంది రైతులు, కాటన్(పత్తి) 42వేల ఎకరాల్లో 39వేల మంది రైతులు సాగు చేస్తున్నట్లు సంబందిత శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఆదర్శ రైతు పునరుద్ధరణ డిమాండ్

గతంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా పనిచేసిన ‘ఆదర్శ రైతు’ వ్యవస్థను పునరుద్ధరించాలనే డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లో బలంగా వినిపిస్తోంది. 2017 వరకు ఆదర్శరైతు వ్యవస్థ కొనసాగింది. కొత్త సాంకేతికతను, ప్రభుత్వ పథకాలను రైతులకు చేర్చడంలో ఈ వ్యవస్థ అప్పట్లో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత పటిష్టంగా తీసుకురావాలని భావించినప్పటికీ, దీనికి సంబంధించిన తుది నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

వ్యవసాయ అధికారుల కొరత వేధిస్తున్న తరుణంలో, ఆదర్శ రైతు వ్యవస్థ వస్తే క్షేత్రస్థాయిలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే విత్తన ముసాయిదా బిల్లుకు చట్టబద్ధత, ఆదర్శ రైతు పునరుద్ధరణ ఫైలుకు మోక్షం ఎప్పుడు లభిస్తుందనే చర్చ జరుగుతోంది.

నెలలు గడుస్తున్నా ఫైళ్లు ముందుకు కదలకపోవడం వెనుక కార్పొరేట్ శక్తుల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా..? అనే అనుమానాలు కూడా రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతాంగ ప్రయోజనాలను కాపాడటానికి విత్తన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని రైతులు, పలువురు రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

విత్తన మార్కెట్‌ను శాసిస్తున్న కార్పొరేట్ కంపెనీలు

 విత్తన మార్కెట్‌ను ఎక్కడ చూసినా కార్పొరేట్ శక్తులు శాసిస్తున్నాయి. నాణ్యత లేని విత్తనాలు, నకిలీల విక్రయాలతో ఏటా వేల సంఖ్యలో రైతులు నష్టపోతున్నారు. పెట్టుబడులు పెట్టి, తీరా పంట చేతికి రాక అప్పులపాలవుతున్నా.. సదరు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతమున్న నిబంధనలు సరిపోవడం లేదు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోతే కంపెనీల నుంచి తగిన పరిహారం ఇప్పించే బలమైన చట్టం రాష్ట్రంలో లేకపోవడం కార్పొరేట్ కంపెనీలకు వరంగా మారింది.

అయితే రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో విత్తన చట్టం ముసాయిదా బిల్లును సైతం రైతు కమిషన్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చింది. ఈ చట్టం ఆమోదం పెందితో రైతులకు భరోసా కలుగుతుంది. దీనికి తోడు రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విత్తనోత్పత్తి రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో విత్తనోత్పత్తి భారీగా జరుగుతోంది.

అయితే రాష్ట్రంలో సమగ్ర ‘విత్తన చట్టం’ తేవాలని, అలాగే రైతులకు క్షేత్రస్థాయిలో అండగా ఉండే ‘ఆదర్శ రైతు’ వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర రైతు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అయినా ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాలేదని సమాచారం. రైతుల అంశాన్ని పరిగణనలోకి తీసుకొని రైతు కమిషన్ సిఫార్సులను ఆమోదిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.