11 July, 2026 | 2:59 AM

‘ధరణి’లో అంతులేని అక్రమాలు!

11-07-2026 01:55 AM
  1. ఫోరెన్సిక్ ఆడిట్‌లో బట్టబయలైన 22 వేల భూ అక్రమాలు 
  2. చనిపోయిన వారి పేరిట ఇంకా సాగుతున్న 63 వేల పెన్షన్ల దందా 
  3. కలెక్టరేట్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా దక్కని న్యాయం
  4. సాంకేతిక లోపాలు.. అధికారుల నిర్లక్ష్యం  
  5. రెవెన్యూ, సంక్షేమ శాఖల్లో భారీ ప్రక్షాళనకు సర్కార్ కసరత్తు

సంగారెడ్డి, జూలై 10(విజయక్రాంతి): తెలంగాణలో భూ పరిపాలన మకుటంగా ప్రచారం పొందిన ‘ధరణి’ పోర్టల్ వెనుక, సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో నమ్మశక్యం కాని రీతిలో అక్రమాలు జరిగినట్లు తాజా ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తు న్నాయి. గత ప్రభుత్వ హయాంలో డిజిటలైజేషన్ పేరుతో జరిగిన లావాదేవీలపై ప్రస్తు త ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక ఫోరెన్సిక్ ఆడిట్, డేటా వెరిఫికేషన్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

అర్హులైన పేదల కు అందాల్సిన లబ్ధిని కొందరు అక్రమార్కు లు ఏ విధంగా పక్కదారి పట్టించారో ఈ నివేదికలు కళ్లకు కడుతున్నాయి. ధరణి పోర్టల్ లో నమోదైన భూముల బదిలీలు, నిషేధిత జాబితా (ప్రోహిబిటెడ్ ల్యాండ్స్) తొలగింపులపై ప్రభుత్వం జరిపిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఏకంగా 22 వేలకు పైగా తీవ్రమైన అక్రమ లావాదేవీలు జరిగినట్లు తేలింది. రాత్రికి రాత్రే ప్రభుత్వ, అసైన్డ్ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చేలా సాఫ్ట్‌వేర్ లూప్‌హోల్స్‌ను వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి.

ఉన్నతాధికారుల డిజిటల్ సంతకాలను, లాగిన్ ఐడీలను దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున భూ మార్పిడులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వేలాది మంది రైతులు తప్పుల సవరణ కోసం పెట్టుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచి, దళారుల దరఖా స్తులను గంటల వ్యవధిలోనే ఆమోదించినట్లు ఆడిట్ బృందం ఆధారాలతో సహా గు ర్తించింది. మరోవైపు సామాజిక భద్రతా పథకాల్లోని లీకేజీలపై ప్రభుత్వం జరిపిన అంత ర్గత విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో దాదాపు 63వేల మంది లబ్ధిదారులు మరణించినప్పటికీ, వారి పేరిట ఆసరా పింఛన్ల సొమ్ము ప్రతి నెలా డ్రా అవుతున్నట్లు నిర్ధారణ అయింది. మున్సిపల్, పంచాయతీరాజ్ మరణాల రికార్డులను ఆసరా పెన్షన్ల డేటాబేస్‌తో అనుసంధానం చేయగా ఈ ఘోరం వెలుగుచూసింది. క్షేత్రస్థాయిలో ఉన్న కొంద రు అధికారులు, దళారులు కుమ్మక్కై, చనిపోయిన వృద్ధులు, వితంతువుల బయోమెట్రి క్స్‌తో సంబంధం లేకుండా నిధులు నొక్కేస్తున్నట్లు తేలింది.

దీనివల్ల ప్రతి నెలా కోట్ల రూ పాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమవుతోంది. కాగా ఆయా నివేదికలపై సీఎం తీవ్రంగా స్పందించారు. ప్రజాధనాన్ని కాజేసిన వారితో పాటు వారికి సహకరించిన అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అక్రమాలకు పాల్పడినట్లు తేలిన రెవెన్యూ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలని, అవసర మైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి, పారదర్శకమైన సరికొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.  

ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్రమాల వెల్లువ 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ధరణి ప్రాథమిక దర్యాప్తులో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సిద్దిపేట కేంద్రంగా అ త్యంత దిగ్భ్రాంతికరమైన లూప్‌హోల్స్ వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై తొలిసారిగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోనే పైల ట్ ఆడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్‌లో వేలాది ఎకరాల నిషేధిత, అసైన్డ్ భూము లు రాత్రికి రాత్రే ఇతరుల పేరిట మారినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ధారించారు.

సిద్దిపేట జిల్లాలో కొనుగోలుదారులు, అమ్మకందారులు ప్ర త్యక్షం గా హాజరుకాకుండానే, మొబైల్ ఓటీపీ లేదా బయోమెట్రిక్ బైపాస్ చేసి సాఫ్ట్‌వేర్ లోపాల సాయంతో భూ హక్కులు మార్చేసినట్లు కేరళ సెక్యూరిటీ ఆడిట్ బృందం ఆధారాలు సేకరించింది. పేదలకు పంపి ణీ చేసిన అసైన్డ్ భూములపై ఉన్న అమ్మకాల నిషేధాన్ని సీసీఎల్‌ఏ స్థాయి ఘోస్ట్ లాగిన్ ఐడీల ద్వారా తొలగించి, సిద్దిపేట, సంగారెడ్డి సరిహద్దుల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుకూలంగా మార్పిడి చేసినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది.

సామాజిక భద్రతా పథకాల లీకేజీలపై గ్రామీ ణ పేదరిక నిర్మూలన సంస్థ, మెప్మా జరిపిన తనిఖీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యధిక శాతం అవకతవకలు బయటపడ్డాయి. మెదక్ పట్టణంలోని ౪వార్డుల్లో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ కోసం పైలట్ సర్వే నిర్వహించారు. ఇక్కడున్న మొత్తం 582 మంది పింఛన్ లబ్ధి దారుల్లో ఏకంగా 39 మంది చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఇదే సర్వేలో మరో 69 మంది లబ్ధిదారుల చిరునామాలే లభ్యం కాలేదు.

వీరు కేవలం కాగి తాలపై సృష్టించిన బోగస్ పేర్లు లేదా దళారులు సృష్టించిన నకిలీ ఐడీలా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. లబ్ధిదారులు మరణించినప్పటికీ స్థానిక అధికారు లు మరణ ధృవీకరణ పత్రాలను సింక్ చేయకపోవడంతో, వారి బంధువులు లేదా దళారులు పింఛన్ల ఏటీఎం కార్డులను వాడుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వైనం ఇక్కడ రికార్డైంది.