ముందు పునరావాసం.. తర్వాతే మూసీ సుందరీకరణ
కపిలవాయి దిలీప్ కుమార్ :
భద్రత, తాగునీటి లభ్యత, వ్యవసా యం, వాణిజ్యం భవిష్యత్తులో నగర విస్తరణకు అనుకూలత వంటి అంశాల కారణంగా మూసీ నది ఒడ్డున హైదరాబాద్ ఆవిర్భవించింది. ఆ తరువాత క్రమంగా దక్కను వీఠ భూమిలోనే అత్యంత సంపన్నమైన సాం స్కృతిక వైభవంతో వెలుగొందిన రాజధానులలో ఒకటిగా పేరొందినది. మూసీ హైదరాబాద్ నగరానికి తాగునీటితోపాటు పరిసర ప్రాంతాలకు సాగునీటిని అందిస్తూ భూగర్భ జలాలను సమృద్ధిగా ఉంచి వ్యవసాయ అభివృద్ధికి జీవనాడిగా నిలిచింది.
వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల్లో పుట్టి సుమారు 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, నల్లగొండ జిల్లా వాడపల్లిలో కృష్ణా నదిలో ఇది కలుస్తుంది. ఈ నది తన ప్రయాణంలో వికారాబాద్, రంగారెడ్డి, హైదరా బాద్, మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల గుండా ప్రవహిస్తున్నది.
1908లో హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చి సుమారు 10 వేల నుంచి-15 వేల మం ది ప్రజలు దుర్మరణం చెందినప్పుడు చలించిపోయిన నిజాం రాజు, వరదల నుంచి ప్ర జలను కాపడటానికి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సివిల్ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించారు.
అనంతగిరి కొండ ల్లోంచి వచ్చే మూసీ, పరిగి ప్రాంతం నుంచి వచ్చే ఈసా నది, ఈ రెండు నదుల నుంచి వచ్చే వరదల్ని నియంత్రించి ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చడానికి ఒక పక్కన హిమాయత్ సాగర్, మరోపక్కన ఉ స్మాన్ సాగర్‌లను మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనల మేరకు 1921లో నిర్మించా రు. 104 సంవత్సరాలు ఈ చెరువులు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చాయి.
శతాబ్దం పాటు జీవనాడి
ఒక శతాబ్దం పాటు హైదరాబాద్‌కు జీవనాడిగా నిలిచిన మూసీ జీవన గమనం 20 వ శతాబ్దం ద్వితీయార్ధంలో అనూహ్యమైన మలుపులు తిరిగింది. జనాభా వేగంగా పెరగడం, నగరం విస్తరించడం, మురుగునీటి వ్యవస్థలు అభివృద్ధి చెందకపోవడం, పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, జంతువుల కళేబ రాలు, పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం వల్ల దుర్గందం వెదజల్లే మురికి కూపంగా నేడు మూసీ మారింది. నిజాం కాలంలో మూసీ నదిపై చాలా వంతెనలు నిర్మించారు.
అందులో 2 వంతెనలు నగరానికి 2 ముఖాలను చూపిస్తాయి. ఒకటి చారిత్రక ప్రాధా న్యం సంతరించుకున్న చాదర్‌ఘాట్ వంతెన, రెండోది ఆధునిక డిజైన్లలో కూడిన నాగోల్ వంతెన. మొదటిది నగరం నడిబొడ్డున, రెం డవది నగర శివార్లలో ఉన్నది. నిజాం కాలం లో పాతబస్తీకి, రెసిడెన్సికీ మధ్య వారధిగా చాదర్ ఘాట్ వంతెన నిర్మించారు. అప్పట్లో ఎడ్లబండ్లు, గుర్రపు బగ్గీల కోసం కట్టిన ఈ వంతెన నేడు లక్షలాది వాహనాల భారాన్ని మోస్తున్నది.
కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్ వ్యాపార కేంద్రాలకు ఇది జీవనాడి. ఇటీవల కాలంలో పిల్లర్ల బలోపేతానికి చేపట్టిన పనుల వల్ల, పిల్లర్ల మధ్య ఖాళీ కుచిం చుకుపోయి వర్షాకాలంలో వచ్చే వ్యర్థాలు ఈ చిన్న చిన్న సందుల్లో ఇరుక్కుపోయి, వం తెన కింద అవరోధాలు ఏర్పడి నీరు వెనక్కి పొంగి కోఠి మార్కెట్‌ను ముంచెత్తుతున్నా యి. చాదర్ ఘాట్ వద్ద నది గర్భంలో విస్తృతంగా పార్కింగ్ వాహనాలు, మెకానిక్ షెడ్లు వెలిశాయి.
వర్షం రాగానే అవి మొదట మునిగి నీటి ప్రవాహానికి అడ్డుపడి వరద తీవ్రతను అనేక రెట్లు పెంచుతున్నాయి. అ లాగే నాగోల్ వంతెన దగ్గర మూసీనది వంపు తిరిగే ప్రాంతంలో ఉన్నది. వరద సమయం లో ఇక్కడ నీరు నేరుగా పారదు. వంపు వద్ద నీటి వేగం తగ్గి ఒడ్డును బలంగా కోస్తుంది. ఫలితంగా 2020 అక్టోబర్ వరదల్లో నాగోల్ వంతెన వద్ద నీటి మట్టం వం తెన స్థాయికి చేరి పక్కన ఉన్న బండ్లగూడ, నాగోల్ కాలనీలు ముంపునకు గురయ్యా యి.
వంతెనకు ఇరువైపుల కాలక్రమే ణా నిర్మాణాలు వెలిశాయి. దీంతో నది విస్తీర్ణం తగ్గింది. భారీ వర్షం వస్తే నీళ్లు పోవడానికి తగినంత స్థలం లేకుండాపోయింది. భారీ వర్షాల సమయం లో మూసీలో చేరే నీటి పరిమాణం అధికం గా ఉంటోంది. కానీ, ఆక్రమణ వలన చాదర్ ఘాట్, నాగోల్ వంటి కీ లక పాయింట్ల వద్ద నది మోయగలిగే సామ ర్థ్యం గణనీయంగా తగ్గిపోయి మిగిలిన నీరు, రోడ్ల మీదకి, నివాస ప్రాంతాల్లోకి చేరుతున్నది.
మూసీ నదిలో స్వచ్ఛమైన నీరు
మూసీ సుందరీకరణ తర్వాత నదిలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి నీటిని వదలనున్నారు. దీని కోసం జంట జలాశయాల్లో ఎల్లప్పుడూ నీరుండేలా గోదావరి రెండోదశ ప్రాజెక్టులో భాగంగా 20 టీఎంసీలను మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తారు. ఇందులో 2.5 టీఎంసీలను హిమాయత్ సాగర్ జలాశయంలోనికి మూసీ పునర్జీవనానికి, మిగిలిన 17.5 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తారని తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాపూఘాట్ ప్రాజెక్టులో రక్షణ శాఖ భూముల వినియోగానికి కేంద్రం ఓకే చెప్పింది. సుమారు 228 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేయగా, అందులో 115 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూమి, 30 ఎకరాలు ప్రైవే టు భూమి, మరో 83 ఎకరాలు రక్షణ శాఖ పరిధిలోనే ఉన్నాయి. ఈ భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయం తీసుకు న్నారు.
బాపూఘాట్ అభివృద్ధిలో భాగంగా 150 నుంచి 153 అడుగుల ఎత్తులో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాపు బొమ్మను ప్రతిష్టించే పీఠం ఎత్తు 100 మీట ర్లు వరకు ఉండనున్నది. దీంతో పాటు గాంధీ సిద్ధాంతాలు, జీవిత విశేషాలను తెలి పే మ్యూజియం, ధ్యాన గ్రామం, శిక్షణా కేంద్రం, లండన్ తరహాలో చరఖా వంటి వా టిని ప్రధాన ఆకర్షణగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
సందర్శకులను ఆకట్టు కునే వాల్ ఆఫ్ లైఫ్ పేరుతో నిర్మాణాలు చేపట్టనున్నారు. సుందరమైన పార్కులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, బోటింగ్ సౌకర్యాలను అం దుబాటులోకి తేనున్నారు. మూసీ, ఈసా నదులు సంగమించే ఈ ప్రాంతంలో గాంధీ అస్థికలను కలిపిన చారిత్రక నేపథ్యం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
మూసీ నిర్వాసితులను ఆదుకోవాలి:-
ప్రస్తుతం మూసీ నది రెండు ఒడ్డుల వెంట సుమారు 5000- వరకు అ క్రమ ఆక్రమణలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీటిలో కొన్ని వేల మంది పేద లు, తెలిసి, తెలియకనో కొందరు నాయకులు, అధికారుల మాయమాటలు నమ్మి పదో, పరకో చెల్లించి ఇండ్లు నిర్మించుకొని ఉంటున్నారు. వీటికి పట్టాలు, నల్లా కనెక్షన్లు, కరెంటు మీటర్లు కలిగి ఉన్నారు. వీరంతా మూసీ సుందరీకరణ వలన నిర్వాసితులయ్యే అవకాశమున్నది.
వీరి పునరావాసా నికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా ‘ముందు ఇండ్లు ఖాళీ చేయండి. తరువాత డబుల్ బెడ్రూంలు ఇస్తాం’ అని చెప్పి బలవంతంగా ఖాళీ చేస్తే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. ప్రజా సంఘాల నుంచి, ప్రజల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతాయి. అందుకే డీపీఆర్ ప్రకటించి, పునరావాస చర్యలు పూ ర్తి చేసిన తరువాతే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లడం మంచిది.
మూసీ పునర్జీవం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం
నేడు మూసీ సమస్య కాలుష్యం మాత్ర మే కాదు. అది నగర భద్రత, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణలకు సంబంధించిన బహుముఖ సవాలు. ఈ సవాళ్లన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభు త్వం మూసీ పునర్జీవనాన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టినట్లు కనబడుతోంది. అందు కే ప్రస్తుతం జరుగుతున్న మూసీ పునర్జీవ ప్రణాళికలో భాగంగా ముందుగా నదీ గర్భా న్ని శుభ్రం చేయాలి. ఇందుకోసం 2 మీటర్ల మేర పూడిక తీస్తారని చెబుతున్నారు.
మూసీ రెండువైపులా 20 మీటర్ల వరకు గ్రీన్ బెల్ట్‌ను కూడా అభివృద్ధి చేస్తారని చెబుతున్నారు. మూసీ వెంబడి షాపింగ్ మాల్స్, హోటల్స్, పీపుల్స్ ప్లాజాలు, సైకిల్ ట్రాక్‌లు, గ్రీన్‌వేలు, హకర్ జోన్లు, బ్రిడ్జీలు, వినోద పర్యాటక ప్రాం తాలు, క్రీడా ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాం తాలు, వాణిజ్య రిటైల్ స్థలాలు, ఆతిథ్య మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ, జాతీ య స్థాయి ప్రముఖుల విగ్రహాలను ఏర్పా టు చేస్తామని ప్రభుత్వం అంటోంది.
గండిపేట నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు 55 కిలోమీటర్ల కొత్త రహదారిని నిర్మిస్తారని ప్రభుత్వం చెబుతోంది. బాపు ఘాట్ నుంచి నల్లగొండ జిల్లా వరకు మూసీ నదిలో మంచినీరు ప్రవహించేలా చేయడమే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది. మూసీ నదిని లండన్‌లోని థేమ్స్ నదిలా, న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలా, ఉత్తర కొరియాలోని టీడాంగ్ నదిలా చేయడానికి రూ.1.5 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టుకు పశ్చిమాన నార్సింగి ఓఆర్‌ఆర్ నుంచి తూర్పున గౌరెల్లి ఓఆర్‌ఆర్ వరకు 55 కిలోమీటర్ల మేర చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం ప్రాంతాల్లోని చెత్త, మురుగునీటిని, ఇతర వ్యర్థాలను తొలగించి 3 సంవత్సరాలలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పంగా కనబడుతోంది. ఈ మొత్తం ప్రణాళికను సింగపూర్‌కు చెందిన మ్యాన్‌హర్ట్ కన్సల్టెన్సీకి అప్పగించారు. పూర్తీ డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.
వ్యాసకర్త: మాజీ ఎమ్మెల్సీ,
తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్
అధ్యక్షుడు, 9963027577






