4 July, 2026 | 2:06 AM

స్మశానవాటిక భూమిని పరిరక్షించాలి

04-07-2026 01:08 AM

హుస్నాబాద్/అక్కన్నపేట, జూలై 3: అక్కన్నపేట మండల కేంద్రంలోని స్మశానవాటిక భూమిని పరిరక్షించి, ఆక్రమణలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు శుక్రవారం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు.మండల కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న అక్కన్నపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు.

స్మశానవాటిక భూమి ప్రజల అవసరాలకు అత్యంత కీలకమైనదని, దానిని ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని కోరారు.అదేవిధంగా, గతంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం కృషి చేసిన కొందరిపై అక్రమంగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని, ప్రస్తుతం భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై సంబంధిత అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెసరు సాంబరాజు,మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.