calender_icon.png 14 February, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కే పట్టణం

14-02-2026 01:18:53 AM

  1. మొన్న పల్లెల్లోనూ హస్తానికి జైకొట్టిన ఓటర్లు
  2.   88 స్థానాల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యత 
  3. నాలుగు కార్పొరేషన్లలోనూ హస్తానిదే పై చెయ్యి 
  4. రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధే గెలిపించాయంటున్న ప్రభుత్వం
  5. సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారంతో కలిసొచ్చిన పుర ఫలితాలు  

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): పల్లెలతో పాటు పట్టణాల్లోనూ ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. వరుసగా వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ హస్తం హవా పెరుగుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలు, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు, తాజాగా పురపాలక, నగర పాలక ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని ఓటర్లు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి.

ఇందులో 88 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ప్రతిపక్ష పార్టీలు కనుచూపు మేరలో కూడా కనిపించని విధంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఓటర్లు ప్రజాప్రభుత్వం పాలనకు మొగ్గు చూపారు. అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీకే జైకొట్టారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే 4 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులే ఎక్కువ డివిజన్లను సాధించారు.

కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా మొత్తం 60 వార్డులలో కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కూడా 22 సీట్లు గెలుచుకుంది. మిగతా పార్టీలు, ఇండిపెండెంట్లు కలిసి మిగతా స్థానాలు గెలుచుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్‌కు  అధిక్యత స్వల్పంగా తగ్గినప్పటికీ  అనిశ్చతి ఫలితాలు రావడం హంగ్‌కు దారి తీసినట్లయింది. ఎన్నికలు జరిగిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు.

గత డిసెంబర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించింది. అంటే రాష్ట్రంలో పల్లెలైనా, పట్టణాలైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు. మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం 116 మున్సిపాలిటీల్లో 88 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

16 సీట్లలో బీఆర్‌ఎస్, 2 చోట్ల బీజేపీ (ఆదిలాబాద్, నారాయణపేట), 2 చోట్ల ఇతర పార్టీలు (భైంసా ఎంఐఎం, వడ్డేపల్లి (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) ఆధిక్యతలో ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో ఎన్నికలు జరగలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన దాదాపు 81 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏకంగా 68 నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. 

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు 75.8 శాతం ఫలితాలు 

 రాష్ట్రంలో ఇటీవల 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, రెబెల్స్ కలిసి 8,335 గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు. దాదాపు 66 శాతం ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది. అప్పటితో పోలిస్తే మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరిగింది. ఈ రోజు మున్సిపాలిటీల ఫలితాలను చూస్తే ఏకంగా 75.8 శాతం ఫలితాలను ఈ రోజు ప్రజాప్రభుత్వం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ శాసనసభ ఉపఎన్నికలు జరిగాయి.

ఈ రెండు ఉప ఎన్నికల్లో అదే తీరుగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. మొన్న 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ పార్టీ 87 స్థానాల్లో విజయం సాధించింది. ఈ రోజు 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే 68 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ కలిసి 13 నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపించాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రజా ప్రభుత్వం ఏ పని చేపట్టినా అవినీతి ఆరోపణలు అంటూ విమర్శలు చేసినా పట్టణ ప్రాంత ప్రజలు వారిని విశ్వసించలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు దాదాపు 17 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రగతి చేపడుతున్న నేపథ్యంలో అర్బన్ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ వైపు పెద్ద ఎత్తున నిలిచారని ప్రభుత్వం భావిస్తోంది. 

 ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పెరుగుతోంది

తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా  ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేశారు. 30 లక్షల మంది పేదలకి రేషన్ కార్డులు, నిరుపేదలందరికీ సన్న బియ్యం, పట్టణాల్లో ప్రగతి పనులకు రూ. 17 వేల కోట్లు ఖర్చు చేయడం, ప్రభుత్వ సంక్షేమ సంస్థల్లో చదువుతున్న 7.5 లక్షల మంది విద్యార్థులకు 40 శాతం కాస్మొటిక్ ఛార్జీల పెంపు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, ఆర్టీసీలో ప్రతి మహిళకు ఉచిత రవాణా, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, పేదవాడికి సొంతింటి కల నేరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద వైద్యానికి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల పెంపు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రగతి పనులను మున్సిపల్ ప్రాంతాల్లోని ప్రజలు సంపూర్ణంగా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు’ అని ప్రభుత్వం చెబుతోంది. అంతే కాకుండా  సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయడం.. ప్రతి పట్టణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని చేయడం కాంగ్రెస్ ఓటు బ్యాంకును మరింత పెంచిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ ఫలితాలపై ప్రియాంక హర్షం 

సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి 

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఎంపీ ప్రియాంక గాంధీని శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టపెట్టారని సీఎం వివరించారు.