14-02-2026 07:03:37 PM
- చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): జిల్లాలో మున్సిపాలిటీల ఫలితాలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ అభ్యర్థులను, కార్యకర్తలను బహిరంగంగా బెదిరింపులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు శనివారం మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాలుగా బహిరంగంగా కత్తులతో బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలను బెదిరిస్తూ, తల్వార్లు, కత్తులతో దాడులకు దిగే ప్రయత్నం చేశారన్నారు.
బీజేపీ అభ్యర్థి డేగ బాపుతో పాటు కార్యకర్తలపై దాడులకు దిగే ప్రయత్నం చేశారని, హైటెక్ సిటీలో బీజేపీ అభ్యర్థి భర్త సురభి రవిని, ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నాయకుడు కిషోర్ రావు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. హమాలివాడలో 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ తన అనుచరులతో బిజెపి నాయకులు ఆకుల సంతోష్, సాతిని రాజులను బెదిరింపుల గురి చేశారని, దొరగారి పల్లెలో బిజెపి అభ్యర్థిని, కార్యకర్తలను బెదిరించారన్నారు.
ఇవి మచ్చుకు కొన్నేనని, ఈ డివిజన్ లలోనే కాకుండా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ లలో కాంగ్రెస్ నాయకులు గుండాల్లాగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను, కార్యకర్తలను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాలలో ఉన్న ప్రశాంతమైన వాతావరణ చెడగొట్టి గూండా, రౌడీ రాజ్యం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి అడ్డుకట్ట వేసి, ఎవరైతే బహిరంగ దాడులకు, బెదిరింపులకు పాల్పడ్డారో వారిపట్ల చర్యలు తీసుకొని ముందు ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీకి విన్నవించినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.