మరమ్మతులకు కమిటీ
- ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీ అధికారులతో సమన్వయం
- దెబ్బతిన్న బరాజ్‌ల వద్ద నెలాఖరులోగా భూసార పరీక్షలు
- వర్షాకాలం తర్వాత శాశ్వత మరమ్మతులు
- వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్, డిజైన్లు పూర్తి
- ఖర్చులను కాంట్రాక్ట్ సంస్థలే భరిస్తాయి
- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్‌జైన్‌తో భేటీ
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డికి, తమ ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశమూ లేదని నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. గత ప్రభు త్వ లోపాల వల్ల దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల బరాజ్‌లను శాస్త్రీయ పద్ధతుల్లో బాగు చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇందుకోసం ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీ అధికారులతో సమన్వయం చేసు కుంటూ, ఐఐటీ ముంబైలోని నిపుణుల సహకారంతో అత్యాధునిక పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ నెలాఖరులోగా భూసార పరీక్షలు పూర్తిచేసి, వర్షాకాలం తర్వాత శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. పారదర్శకత కోసం ప్రత్యేక కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈనెల 20వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మేడిగడ్డ బరాజ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శుక్రవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్‌జైన్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు.
ఈ భేటీలో బరాజ్‌ల రిపేర్లు, పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక ను చర్చించారు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలను వివరించారు. అన్ని కో ణాల్లో నిపుణుల ఆధ్వర్యంలో ప్రస్తుతం పరీక్షలు చేపడుతున్న తీరుపై ఎన్‌డీ ఎస్‌ఏ చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే తాను స్వయంగా బరా జ్‌ల సందర్శనకు వస్తానని చెప్పారు.
అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లా డారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్‌జైన్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు, పునరుద్ధరణపై చర్చించామని తెలి పారు. గోదావరి వరదలు వచ్చేలోగా సాయిల్ టెస్టింగ్, డిజైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై కేసీఆర్ హయాంలో చేసిన పొరపాటు తెలంగాణ ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు.
బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరాన్ని నిర్మించారని, అది కూలిపోయిందన్నారు. కాళేశ్వరంపై దాదాపు రూ.97 వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. కాళేశ్వరంపై ప్రతి ఏడాది రూ.10 వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలిపారు. ప్రజాధనం ఉపయోగించడంతోనే దాన్ని ఎలా రిపేర్ చేయాలో ఆలోచించి ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలు అన్ని విషయా లు గమనిస్తున్నారని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ డ్యామేజ్ సాయిల్ టెస్ట్, డిజైన్ల ఖర్చులను కాంట్రాక్ట్ సంస్థలే భరిస్తాయని పేర్కొన్నారు.
దశలవారీగా శాస్త్రీయ పరీక్షలు..
బరాజ్‌ల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నిపుణుల సంస్థలను ప్రభుత్వం నియమించింది. డిజైనింగ్, టెస్టింగ్ సంస్థలు రంగంలోకి దిగాయి. డిజైన్‌కు ముందు అవసరమైన పరీ క్షలు, అధ్యయనాలను సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సంస్థ చేస్తుంది. బరాజ్‌ల పునరుద్ధరణ కోసం జీపీఆర్(గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్, జియోటెక్నికల్, జియో ఫిజి కల్ పరీక్షలతో భూమి, అక్కడ నిర్మాణాల సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకోను న్నారు.
వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇరిగేషన్ శాఖ అధికారులు, సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ప్రతినిధులు, డిజైనింగ్ సంస్థ ప్రతినిధులు, ఇతర టెక్నికల్ ఏజెన్సీలు సభ్యులుగా ఉన్నారు. పరీక్షలు సకాలంలో జరిగేలా చూడడం.. అవసరమైన డేటా సమయానికి అందించడం, అన్ని ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం ఈ కమి టీ చూసుకుంటుంది.
ఈ ప్రక్రియ అంతా సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగేందుకు, కేంద్రస్థాయి నిపుణుల పర్యవేక్షణ కూడా ఉండే దిశగా ప్రభుత్వం చర్యలు తీసు కుం టోంది. అవసరమైతే ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాన్ని కూడా ఇందులో చేర్చే అవకాశముం ది. ప్రస్తుతం బరాజ్‌ల ఫౌండేషన్, కట్ ఆఫ్ వాల్ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయనున్నారు. అన్నిరకాల పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, ఇప్పుడున్న నిర్మాణ లోపాలు గుర్తించి...
పూర్తి సమాచారం విశ్లేషణల ఆధారంగా వాటికి అనుగుణంగా పునరుద్ధరణ పనులకు డిజైనింగ్ సంస్థ కొత్త డిజైన్ల ను సిద్ధం చేస్తుంది. ఈ డిజైన్‌ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పంపించి.. వాళ్లు మార్గదర్శకాలకు అనుగుణంగా పు నరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపడుతుంది. భవిష్యత్‌లో 50 నుంచి 100 ఏళ్ల పాటు బరాజ్‌లు సురక్షితంగా భద్రం గా ఉండేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కాళేశ్వరం బరాజ్‌ల రిపేర్‌పై ఫోకస్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేప ట్టింది. ఈ మూడు బరాజ్‌ల పరిస్థితిని అంచనా వేసి, పనులను సమన్వయం చేయడానికి ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటి పారుదల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. బరాజ్‌ల భద్రత, నిర్మాణ స్థితిని సమగ్రంగా అంచ నా వేయడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు జియో-ఫిజికల్, జియో-టెక్నికల్ పరిశోధనలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మాన్సూన్ ప్రారంభానికి ముందే అంటే 2026 మే 30 నాటికి ఈ పరిశోధనలు పూర్తి చేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి టన్నెల్స్ అండ్ సేఫ్టీ విభాగ కార్యదర్శి కల్నల్ పరిచిత్ మెహ్రా అధ్యక్షత వహించనున్నారు.
ఇరిగేషన్ శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు, కన్సల్టెన్సీ సంస్థలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ, పరిశోధనల అమలు నుంచి డిజైన్ పనుల వరకు అన్ని దశలను సమన్వయం చేయనుంది. కమిటీకి ప్రభుత్వం స్పష్టమైన మార్గ దర్శకాలు జారీచేసింది. కమిటీ పనులకు సహకరించేందుకు డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ అజ్మల్ ఖాన్, కన్సల్టెంట్ యాదగిరి నియమితులయ్యారు.






