31 July, 2026 | 2:03 AM

విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తాం

31-07-2026 12:25 AM

డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వ హాస్టళ్లు సిద్ధం 

గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్ ను పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి

గజ్వేల్, జూలై 30: దోస్త్ ద్వారా గజ్వేల్  ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థి, విద్యార్థినులు వసతి సమస్య కారణంగా చదువును మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితి రానివ్వబోమని జిల్లా కలెక్టర్ కె. హైమావతి స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున హాస్టల్ సౌకర్యం కల్పించి ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురువారం గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల కోసం ఎడ్యుకేషన్ హబ్లో, డిగ్రీ కళాశాల, హాస్టల్లో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రం నలుమూలల నుంచి దోస్త్ ద్వారా అడ్మిషన్ పొందిన నిరుపేద విద్యార్థులు ప్రైవేట్ గదులు అద్దెకు తీసుకునే స్థోమత లేక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం హాస్టల్ వసతి కల్పిస్తుందన్నారు. వసతి సమస్యతో ఏ విద్యార్థి కూడా కళాశాలను మార్చుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. గజ్వేల్లో ఎడ్యుకేషన్ హబ్ వెనుక ఖాళీగా ఉన్న భవనాలను హాస్టల్గా తీర్చిదిద్దాలని, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో కొన్ని గదులను కేటాయించి బెడ్లు, వాష్రూమ్లు, కిచెన్ తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అనితా అబ్రహాం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.