31 May, 2026 | 1:35 AM

జీవో 07ను వెంటనే రద్దు చేయాలి

31-05-2026 12:00 AM
  1. లేనిపక్షంలో సీఎంకు నిద్రలేని రాత్రులే..
  2. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
  3. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తేసే కుట్రలు మానుకోవాలి
  4. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి

ముషీరాబాద్, మే 30 (విజయక్రాంతి): తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ అర్.కృష్ణయ్య హెచ్చరించారు. లేనిపక్షంలో ఉద్యమాలతో సీఎంకు నిద్ర లేకుండా చేస్తాం అన్నారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డా.ర్యాగ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం బషీర్ బాగ్  ప్రెస్ క్లబ్ లో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన ఎంపీ అర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.07 వల్ల పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆరోపించారు.

ఫీజులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేయడం వల్ల కాలేజీలు అడ్మిషన్లు ఇవ్వడంలో సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం రూ.8 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే జీవో నెం.07ను ఉపసంహరించుకుని పాత విధానాన్నే కొనసాగించాలని కోరారు.

సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా శెట్టి వంశీ యాదవ్ కు నియామక పత్రం అందజేశారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధన చారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఆపివేసే కుట్రలు, కుల గణన చేయకుండా బీసీల సంఖ్యపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తద్వారా బీసీలను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని మండి పడ్డారు.

బీసీలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుద్ధ సత్యం మాట్లాడుతూ  రీయింబర్స్మెంట్ ను ఎత్తివేసే కుట్రలు చేస్తే సహించే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో  నేతలు కత్తి వెంకటస్వామి, మేకల రాములు, గొరిగే మల్లేష్, లాల్ కృష్ణ, విజిఅర్.నారగోని, శ్రీనివాస్, కృష్ణుడు, గుజ్జ సత్యం, నీల వెంకటేష్ ముదిరాజ్, జిల్లపల్లి అంజి, పగిళ్ల సతీష్, జి.అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.