పంట కుంటల పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: అదనపు కలెక్టర్
31-07-2026 02:23 AM
గద్వాల టౌన్, జూలై 30: గద్వాల మండలంలోని బసల్ చెరువు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పంట కుంటల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ బి. నర్సింగ్ రావు గురువారం తనిఖీ చేశారు.
పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేసి, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పుటాన్పల్లి సమీపంలోని గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతి, భోజనం, తాగునీరు, పరిశుభ్రత, విద్యా బోధన తదితర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలను మెరుగుపర్చాలని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.






