31 July, 2026 | 3:27 AM

తలసేమియా బాధితులకు పింఛన్లు

31-07-2026 02:24 AM
  1. ఆగస్టు 15 నుంచి పంపిణీ
  2. వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు కూడా..   
  3. అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఎంపీడీవోలకే   
  4. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్:  రాష్ట్రంలోని తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా బాధితులందరికీ ఆగస్టు 15 నుంచి సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు కూడా పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో జాప్యానికి తావివ్వద్దన్నారు. ముఖ్యంగా మరణించిన దివ్యాంగుల భార్యలకు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. మండల స్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీవోలే పర్యవేక్షించాలన్నారు.

ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని స్పష్టం చేశారు. సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని సీఎం తెలిపారు.  రాష్ట్రంలోని తారు రోడ్డు లేని ఊరు ఉండవద్దని, ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యాలయం నిర్మించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలోని జనాభా ఆధారంగా ఏ, బీ, సీలుగా వర్గీకరించి భవనాలు నిర్మించాలన్నారు. కార్యదర్శులు పారిశుద్ధ్య పనులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో బాధ్యత వహించేలా చూడాలన్నారు. ఎన్నికలు జరగని పంచాయతీల్లో పారిశుద్ధ్య, ఇతర పనులకు ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.  

ఇందిరమ్మ చీరల నాణ్యతలో రాజీపడొద్దు

కోటి మంది మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. డిజైన్ల రూపకల్పనకు ఎన్‌ఐఎఫ్టీ విద్యార్థులను వినియోగించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ చీరలకు మహిళల నుంచి మంచి స్పందన వచ్చినందున, నాణ్యత, రంగుల విషయంలో ఎటువంటి రాజీపడొద్దని సూచించారు. ఎల్ నినో నేపథ్యంలో తాగునీటి సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గ్రామీణ తాగు నీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.  గ్రామీణ తాగు నీటి పథకాల పరిధిలో పని చేసే వారికి  5లోపు వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు. సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, పీఆర్‌అండ్ ఆర్డీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఈవో సెర్ప్ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.