8 June, 2026 | 2:45 AM

ఆర్మీ ఉద్యోగి దారుణ హత్య!

08-06-2026 01:36 AM
  1. భార్య, ఆమె సోదరుడు, తల్లిదండ్రుల ఘాతుకం 
  2. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నారని దాడి
  3. మెదక్‌లోని మిలటరీ కాలనీలో ఘటన

మెదక్, జూన్ 7 (విజయక్రాంతి): భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని భార్య, ఆమె సోదరుడు తల్లిదండ్రులతో కలిసి దారి చేయడంతో ఓ మిలటరీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన పుంటికూర కుమార్ గౌడ్(50) భార్య పద్మ ఇద్దరు కూతుళ్లతో మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న కుమార్ గౌడ్ ఇటీవల స్వగృహానికి వచ్చినట్లు తెలిపారు. కుమార్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతండేవి.ఈ క్రమంలో ఆదివారం మరో మహిళలతో ఉన్న కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, అత్తమామ, బావమరిదితో పాటు ఇతర వ్యక్తులు కుమార్ గౌడ్ పై దాడికి పాల్పడగా ఆయన మృతి చెందాడు.

విషయం తెలుసున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులు పద్మ, ఆమె తల్లిదండ్రులు రామకృష్ణా గౌడ్, ఎల్లమ్మ, సోదరుడు సంతోష్ పోలీసులకు లొంగిపోగా, ఇతర గుర్తు తెలియని వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.