8 June, 2026 | 3:48 AM

రాజ్యసభ సీట్లలో బీసీలకు అన్యాయం

08-06-2026 01:36 AM
  1. సామాజిక న్యాయాన్ని బొందపెట్టిన కాంగ్రెస్ 
  2. ఆ పార్టీ మాటలకు ఆచరణకు ఎక్కడ పొంతనలేదు 
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  

హైదరాబాద్, జూన్ 7(విజయక్రాంతి): రాజ్యసభ ఖాళీల పరిధిలో సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బొందబెట్టినదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యసభ స్థానాలను భర్తీ చేస్తున్న ఖాళీల్లో బీజేపీ నుంచి 11లో ఓసీలకు ఆరు, బీసీలకు 4, ఎస్టీలకు ఒకటి కేటాయించిందని, కాంగ్రెస్, ఏడులో ఓసీలకు 4, ఎస్సీలకు రెండు, మైనార్టీలకు ఒకటి ఇచ్చిందని, తెలుగుదేశం మూడింటిలో ఓసీలకు రెండు, బీసీలకు ఒకటి కేటాయించిందని,

ఇక జనసేన ఒకటిలో కూడా ఓసీలకు ఉన్న ఒకటి ఇచ్చిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఏడు సీట్లలో ఒక్కటి కూడా బీసీలకు కేటాయించకపోవడం చాలా దుర్మార్గమన్నారు, కాంగ్రెస్ పార్టీ మాటలకు, ఆచరణకు ఎక్కడ పొంతనలేదని.. రాజ్యసభ సీట్ల కేటాయింపు ప్రత్యక్ష ఉదాహరణని ఆయన తెలిపారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఒక్కరికి కూడా బీసీలకు అవకాశం కల్పించలేదని,

చివరికి రాజ్యసభ సీటు కేటాయింపులు ఒక్క సీటు అవకాశం వస్తే ఆ ఒక్క సీటును కూడా అగ్రకులాలకే కేటాయించి జనసేన అగ్రకుల సేనగా మార్చాడని ఆయన ఆరోపించారు. బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీలను గుర్తించి భవిష్యత్తులో వారిని రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమని, బీసీలకు అన్యాయం చేసే ఎవరిని వదిలిపెట్టేది లేదని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.