23 April, 2026 | 4:09 PM

హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ సంబరాలు

23-04-2026 03:06 PM

హై కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు

దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్  పై హైకోర్ట్ ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టన్నారు.

కేసీఆర్ రైతుల సంక్షేమమే  లక్ష్యంగా పనిచేశారని,  కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబందుల్లా రాష్ట్రాన్ని దోచుకోవడమే రేవంత్ అండ్ టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు అయ్యాయనీ, అధర్మంపై ధర్మం విజయం సాధించిందనీ, కేసీఆర్ నిజాయితీకి, తెలంగాణ రైతుల నమ్మకానికి, ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డ ఇంజినీర్ల శ్రమకు దక్కిన గౌరవం ఈ తీర్పని, ప్రజల దృష్టిని మళ్ళించడానికే బి ఆర్ ఎస్ నాయకుల మీద బురద జల్లుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి 420 హామీల ఇచ్చి, ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కాక పొద్దున లేస్తే కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాదన్నారు.

ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కూడా రేవంత్ లో లేవనీ, పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలనీ, తెలంగాణకు కల్పతరువు అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను రెండేళ్లుగా నిరుపయోగంగా ఉంచినందుకు రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రాజ్యాంగం, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా న్యాయవ్యవస్థ చూస్తూ వూరుకోదన్నారు. ఆర్ టి సి కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని, మా పూర్తి మద్దతు ఆర్ టి సి కార్మికులకు ఉంటుందని తెలిపారు. మరో రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పక్కా వస్తుందనీ, అప్పుడు మీ లెక్కలు తప్పక సరిచేస్తామన్నారు. ప్రజలు ఆలోచనలో పడ్డారనీ, నమ్మించి గొంతుకోసిన కాంగ్రెస్ కి ఓటు అనే ఆయుధంతోనే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

అనంతరం గురువారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజల తరుపున కె సి ఆర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ రమేష్, పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల, మాజీ ఉప సర్పంచ్ దారా యుగంధర్, గాజుబోయిన ఏసుబాబు, అబ్దుల్ జిన్నా, బుడే, నియోజకవర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాస్ రావు, వార్డ్ మెంబర్లు దారా రాము, గోళ్ళ భవనీ కృష్ణ యాదవ్, రూపా రాంబాబు, కౌలురి నాగయ్య, మండల బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు మండవ సత్య, కాసిని శ్రీను, మద్దెల పుల్లారావు, వెలుగోటి మహేష్, దండాబత్తుల కాంతారావు, శేషాద్రి, ధర్మ, పోలారావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.