15 June, 2026 | 3:37 AM

మమతకు లీగల్ నోటీసులు

15-06-2026 02:18 AM

టీఎంసీ అధినేత్రిపై పరువు నష్టం దావా 

కోల్‌కతా, జూన్ 14 (విజయక్రాంతి): టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అధికారం చేజారిన 14వ రోజు తరువాత ఆమెను, టీఎంసీని ఆటంకాలు సుడిగుండంలా చుట్టుముట్టి ముంచెస్తున్నాయి.

టీఎంసీ రెబల్ ఎంపీ కకోలీ ఘెష్ కుమారుడు మనోవైద్య నిపుణుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపారు. ఈమెతోపాటు ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, సౌగత్ రాయ్, మహువా మొయిత్రాలకు కూడా నోటీసులు పంపాడు. బరసత్ అసెంబ్లీ స్థానంలో పోటీచేసేందుకు తాను పార్టీ టికెట్ కోరానని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో డిమాండ్ చేశాడు. నోటీసులకు స్పందించకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించాడు.

జూన్ మొదట్లో మమతా బెనర్జీ పలు సభా వేదికలపై, సామాజిక మాధ్యమాల్లో ఎంపీ కకోలీ పేరు తీసుకోకుండానే పలు ఆరోపణలు సంధించారు. బైద్యనాథ్ ఎమ్మెల్యే టికెట్ కోసం తనను సంప్రదించిన తీరుతెన్నులను వివరిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. కకోలి టీఎంసీని వీడడంతోనే తనకు టికెట్ ఇవ్వలేదని ఎన్డీయేకు మద్ధతిచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని, ఆరోపణలను బైద్యనాథ్ ఖండించారు. దీంతోపాటు తన తల్లి ఏడుస్తోందని మహువా మొయిత్రా చేసిన ఆరోపణలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. విభేదాలుంటే రాజకీయంగా పరిష్క రించుకోవాలే తప్ప, వ్యక్తిగత, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగకూడదన్నారు. తన చట్టపరమైన హక్కులను కాపాడుకుంటానని బైద్యనాథ్ నోటీసులు హెచ్చరించారు.