15 June, 2026 | 3:36 AM

సోంపల్లిలో అక్రమ ఇసుక రవాణా

15-06-2026 02:16 AM

లారీలను అడ్డుకున్న స్థానికులపై దాడి?

విచారణ కోసం వెళ్లి తిరిగొస్తున్న పోలీసులను ఢీకొట్టిన లారీ

ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు.. భద్రాచలం ఆసుపత్రికి తరలింపు 

బూర్గంపాడు, జూన్ 14 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గ్రామానికి చెందిన బీసీ కాలనీవాసులు లారీలను అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

ఈ ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా జీరో వ్యాపారం జరుగుతుందని బీసీ కాలనీకి చెందిన కొందరు యువకులు, గ్రామస్థులు ర్యాంపులో శనివారం రాత్రి ఇసుక లారీలను నిలిపివేసే ప్రయత్నం చేయగా ఆ సమయంలో ర్యాంప్ నిర్వాహకులకు చెందిన కొందరు దాడి చేశారని, ఈ విషయంపై మాట్లాడేందుకు గ్రామస్థులు ఆదివారం కూడా ర్యాంపు వద్దకు వెళ్లినట్లు తెలిసింది.

ర్యాంపు వద్ద స్థానికులపై నిర్వాహకులు దాడిచేసిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆదివారం బ్లూకోట్ కానిస్టేబుల్, హోంగార్డు విచారణకు వచ్చి విచారణ అనంతరం తిరిగి వెళుతుండగా ఇసుకలారీ పోలీసు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వీరిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఇసుక ర్యాంపుల నిర్వాహకులు చేసేది అక్రమ వ్యాపారమైనా ఇలా ప్రశ్నించిన, అడ్డుకున్న వారిపై దాడులు చేయిస్తుంటారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

బూర్గంపాడు ఎస్‌ఐ క్లారిటీ..

పోలీసు కానిస్టేబుల్ మంగీలాల్, హోంగార్డు శ్రీనివాసరావులు సొంపల్లికి వెళ్లి గ్రామస్తులకు సర్థి చెప్పి పంపించారని ఎస్‌ఐ మేడా ప్రసాద్ స్పష్టం చేశారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై తిరిగి దోమలవాగు నుంచి బయటకు వస్తున్న క్రమంలో లారీ(ఏపీ16 డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపి ముందున్న బ్లూకోట్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు.

ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మంగీలాల్, హోంగార్డు శ్రీనివాసరావులకు గాయాలుకావడంతో పాటు ద్విచక్రవాహనం, రెండు ట్యాబ్‌లు ధ్వంసమైనట్లు ఎస్‌ఐ తెలిపారు. గాయపడిన వారిని భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందింప చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులకే రక్షణ కరవైందా?..

అసాంఘిక శక్తులను అణిచివేసే రక్షకభటులకే రక్షణ కరవైందా అనే అనుమానం సొంపల్లి ఘటనతో తలెత్తుతుంది. స్థానికుల ఫిర్యాదుతో ఇసుక ర్యాంపు వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా వివరాలు సేకరించి తిరిగి వస్తుండగా లారీ వెనుక నుంచి పోలీసు వాహనాన్ని ఢీకొట్టడం ప్రణాళిక ప్రకారమే జరిగిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఇసుక ర్యాంపు మాఫియాను ప్రశ్నించిన, నిలదీసిన వారి పట్ల ఇలాంటి దాడులు కొత్తేం కాదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న నమ్మకం పోతుందంటున్నారు. ఏది ఏమైనా పోలీసులను కావాలనే లారీతో ఢీకొట్టారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.