కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి
- ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్న నినాదం
- అన్యాయంపై బీఆర్‌ఎస్ పోరాటం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హనుమకొండ, జూన్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ పోవాలి.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలి.. అనే నినాదం ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నదని, ప్రజల ఆకాంక్షల మేరకు మళ్లీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పార్టీ కార్యకర్తల అండదండలతో తెలంగాణ ప్రజలపై జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్ ముందుండి పోరాటం చేస్తుందని అన్నారు.
ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ‘ఎంపవర్ ఏ చైల్డ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, పేదల కుటుంబాలకు ఎంతో మేలు చేసిందని అన్నారు. పేద ప్రజల పిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అనేక పథకాలు అందించిన ఘనత కేసిఆర్ కి దక్కిందన్నారు.
రాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వంలో బాల్య వివాహాలను రూపుమాపడం జరిగిందని, ఈరోజుకి ఇప్పటివరకు శిశు మరణాల రేటు తగ్గించి వారికి అండగా నిలిచి బాలింతలకు కెసిఆర్ కిట్టు అందించారని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 1000 పాఠశాలల్లో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి చిన్నపిల్లలకు చదువును అందించారని తెలిపారు.
ఇంట్లో తాగునీటి కొరత లేకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల, పట్టణాల లంబాడ తండాలలో ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీరు అందించిన ఘనత కేసిఆర్ కి దక్కిందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, నరెడ్ల శ్రీధర్, చుంచు రమేష్ వర్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, రంజిత్‌రెడ్డి సహకారంతో 500 మంది పేద విద్యార్థులకు స్కూల్ ఫీజు చెక్కులను పంపిణీ చేశారు.






