మహిళా వ్యతిరేకి కాంగ్రెస్
మేడ్చల్‌లో బీజేపీ భారీ నిరసన, నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేపట్టిన నాయకులు
సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ధ్వజం
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ లో భాగంగా పార్లమెంటులో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ మేడ్చల్ సర్కిల్ లో శనివారం రోజు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. శనివారం పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ... దేశంలో మహిళలు చట్టసభల్లోకి రాకుండా అడ్డుపడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తే, దానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూ మహిళలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు.






