ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది
కూసుమంచి,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ రైతుల కష్టాలు తీర్చే నాధుడు కరువయ్యారని, 15 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ చేసినప్పటికీ వాటిని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రైతుల సమస్యల పరిష్కరించి ధాన్యం కొనుగోలు చేయాలని, వెంటనే మిల్లును అలాట్మెంట్ చేయాలని బిజెపి పాలేరు నియోజవర్గ ఇన్చార్జ్ నున్నా రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలేరు గ్రామంలోని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బిజెపి నాయకులుతో కలిసి పరిశీలించారు.
అక్కడున్న రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నున్నా రవికుమార్ మాట్లాడుతూ... జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతుల సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో దళారి వ్యవస్థ ఎక్కువైందని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలు దళారి వ్యవస్థ పెరిగినప్పటికీ, కనీసం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు.
తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు రవి రాథోడ్ మాట్లాడుతూ నియోజవర్గంలో అత్యధికంగా మొక్కజొన్న పంట దిగుబడి వచ్చినప్పటికీ అరకొరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తక్షణమే మండలానికి రెండు మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పుణ్యవతి, మండల ప్రధాన కార్యదర్శిలు మహేందర్ నాయక్, వీరన్న, సీనియర్ నాయకులు దాసరి వెంకటేశ్వర్లు, మోతిలాల్, శ్రీకాంత్, కోటేశ్వరావు మరి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు






