22 May, 2026 | 2:56 AM

రహదారులపై బైక్ స్టంట్లు

22-05-2026 01:00 AM

యువకులను అరెస్ట్ చేసిన కూసుమంచి పోలీసులు

కూసుమంచి, మే 21(విజయక్రాంతి): సోషల్ మీడియాలో లైకులు, రీల్స్ కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ...బహిరంగ రహదారులపై ప్రాణాపాయం కలిగించే విధంగా బైక్ స్టంట్లు చేస్తూ..., మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఇద్దరు యువకులను ఖమ్మం టాస్క్ ఫోర్స్, కూసుమంచి ఎస్త్స్ర  నాగరాజు అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. 

ఇటీవల కాలంలో ఖమ్మం నగరంతో పాటు, పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై ప్రమాదకర విన్యాసాలు చేసి ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్న కుసుమంచి మండలం, పరికసింగారం గ్రామానికి చెందిన మాదవరుపు శివ రామకృష్ణ, (20 సం) కోక్య తండా కు చెందిన బానోత్ జశ్వంత్ (18సం)ను గురువారం కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ సోషల్ మీడియా బృందం నిశితంగా పరిశీలిస్తుందని,  ఈ తరహా చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు మోటారు వాహన చట్టం, పబ్లిక్ న్యూసెన్స్ కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.

బహిరంగ రోడ్లపై బైక్ విన్యాసాలు చేయడం చట్టరీత్యా నేరమని, విన్యాసాలు స్టంట్లు చేసే యువకుల ప్రాణాల మీదికి తేవడమే కాకుండా, రోడ్డుపై వెళ్లే పాదచారులకు, ఇతర వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారుతున్నరాని అన్నారు. ప్రదానంగా తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వకూడదని, అదేవిధంగా పిల్లల రోజువారి  కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ ఉండాలని, చట్టవరుద్ధమైన ప్రాణాపాయం కలిగించే ఇలాంటి పనులకు దూరం ఉండేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు.

అలాగే యువత ఇలాంటి సాహసాలకు పోయి ప్రాణాలను పోగొట్టుకోవద్దని సూచించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే, స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మోటారు వాహన చట్టం ప్రకారం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రేసింగ్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానాలు పడే అవకాశం ఉందన్నారు.