బీసీలపై అసత్య ప్రచారాలు
ఛానల్‌ను బహిష్కరిస్తాం, ఎండీ దిష్టిబొమ్మ దహనం
మహేష్ కుమార్ గౌడ్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన బీసీ సంఘాల నేతలు
ముషీరాబాద్, మే 23 (విజయక్రాంతి): బీసీలను రాజకీయంగా అణచివేయాలనే కుట్రలో భాగమే ఓ టీవీ ఛానల్ కల్పిత కథనాలు ప్రసారం చేస్తుందని బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌పై ఒక అగ్రకుల ఛానల్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్‌పై ఓ ఛానల్ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట ఆ ఛానల్ ఎండి దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి దుష్ప్రచారాలు చేస్తున్న ఛానల్ పై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేష్ చారి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ కో చైర్మన్ ఉప్పరి శేఖర్ లు ఛానల్ విధానాలపై ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. వెంటనే క్షమాపణలు చెప్పకుంటే ఛానల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.






