24 May, 2026 | 2:24 AM

ఇండోర్ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి: కొప్పుల నర్సింహ్మారెడ్డి

24-05-2026 01:26 AM

నాగోల్, మే 23 (విజయక్రాంతి): మన్సూరాబాద్ డివిజన్ మల్లికార్జున్‌నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్‌కు మాజీ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను క్రీడల వైపు మళ్లించడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు.

ముఖ్యంగా క్యారమ్ వంటి ఇండోర్ క్రీడలు పిల్లల్లో ఏకాగ్రత, సహనం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండేందుకు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ టోర్నమెంట్‌లో చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 80 ఏళ్ల వయస్సు గల వారు కూడా పోటీల్లో పాల్గొనడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు.

రంగారెడ్డి జిల్లా క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్ సభ్యులు, క్రీడాభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.