మళ్లీ హోర్ముజ్ జలసంధి మూసివేత
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ నిర్ణయం
- దాడులకు ప్రతిగా ఇది తమ తొలి నిర్ణయమని ప్రకటన
- మున్ముందు మరిన్ని దూకుడు చర్యలుంటాయని హెచ్చరికలు
- ఇజ్రాయెల్, అమెరికా ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డాయని ఆరోపణలు
న్యూఢిల్లీ, జూన్ ౨౦: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడటం, తద్వారా లెబనాన్ ప్రజల ప్రాణాలను హరించడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దాడులకు ప్రతిగా హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఆ దేశ అత్యున్నత సంయుక్త సైనిక కమాండ్, ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయమైన ‘ఖతమ్ అల్-అన్బియా’ నుంచి ప్రకటన వెలువడింది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులను విశ్వాసఘాతుకమని అభివర్ణించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. లెబనాన్‌పై దాడులకు ప్రతి తాము తీసుకున్న మొదటి అడుగు ఇదేనని, మున్ముందు మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటామని, పర్యావసానాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ లెబనాన్ నుంచి ఇరాన్ తక్షణం తన సైనిక దళాలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఇరాన్ తాజా ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆందోళనలు నెలకొన్నాయి.
ఏదేమైనా, లెబనాన్ విషయంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాలు అమెరికాకు కొరకరాని కొయ్యలా తయారయ్యాయనేది మాత్రం వాస్తవం. స్విట్జర్‌లాండ్ వేదికగా త్వరలో శాంతి ఒప్పందాలపై అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తారన్న తరుణంలో లెబనాన్‌పై దాడులు చర్చనీయాంశమయ్యాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
ఇరాన్‌ప్రకటనను తోసిపుచ్చిన అమెరికా
హోర్ముజ్ జలసంధి మూసివేతపై ఇరాన్ ప్రకటనను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తోసిపుచ్చారు. జలసంధి మూతపడినట్లు తమకు అధికారికంగా ఎలాంటి సమచారం అందలేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న 14 అంశాల ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ కొనసాగుతుందనే నమ్మకం తమకు ఉందని ఉద్ఘాటించారు. జలసంధి ద్వారా ఇంధన నౌకల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని కూడా ధీమా వ్యక్తం చేశారు.
అలాగే, దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ ఆధ్వర్యంలో అమెరికన్ బృందం స్విట్జర్లాండ్‌లో శాంతి చర్చలకు రంగం సిద్ధమైంది. ఇరాన్ బృందం కూడా స్విట్జర్లాండ్ చేరుకుంటందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ ప్రకటించడం గమనార్హం.






