9 July, 2026 | 2:15 AM

వైభవంగా బల్కంపేట బోనాల ఉత్సవాలు

09-07-2026 12:39 AM
  1. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
  2. మౌలిక సదుపాయాలపై అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, వైభవోపేతంగా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా, కన్నుల పండువగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆషాడ బోనాల జాతర, ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం పోస్టర్‌లను మంత్రి సురేఖ ఆవిష్కరించారు.

20, 21, 22 తేదీల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల ఏర్పాట్లను సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా చేయాలన్నారు. పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారని, రహదారి, మౌలిక సదుపాయాలు, క్యూలైన్లు, ప్రసాద వితరణ, విద్యుత్, లైటింగ్, తాగునీరు సదుపాయాలను కల్పించాలన్నారు. శాఖలన్నీ సమన్వయంగా, సంయుక్తంగా కలిసి పనిచేయాలని సూచించారు. గత అనుభవాల దృష్ట్యా, వీఐపీలు, వీవీఐపీలు వచ్చే ఎంట్రన్స్‌ల వద్ద భద్రతను పెంచాలని, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని, అదే సమయంలో సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

ఆలయ పరిసరాల్లో జీహెచ్‌ఎంసీ పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలని తెలిపారు. శానిటేషన్ ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. అదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ శిబిరాలను ఏర్పాటు చేయాలని, 108 అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బోనాల ఉత్సవాలు అత్యంత ప్రాధాన్యత కలిగినందువల్ల పోలీసు శాఖ అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తూ భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనీయాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.