ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
24 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన మద్నూర్ పోలీసులు
సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో కిడ్నాపర్ గుట్టు రట్టు
కిడ్నాపర్ అరెస్టు రిమాండ్
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
కామారెడ్డి, జూలై 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 6 ఏళ్ల మైనర్ బాలిక అపహరణ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి, బాలికను సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలికను మహారాష్ట్రకు తరలించి విక్రయించేందుకు ప్రయత్నించిన నిందితుడిని అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు.
కేసు వివరలోకెళ్తే ...
ఫిర్యాదుదారురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె నిజామాబాద్కు వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఉన్న తన కుమార్తెను కుటుంబ సభ్యుల పరిచయస్తుడైన నిందితుడు మోసపూరితంగా అపహరించాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో మద్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు, బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని విశ్లేషిస్తూ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు బాలికను ఆటోలో మహారాష్ట్రలోని దెగ్లూర్ ప్రాంతానికి తీసుకెళ్లి, ఎవరికీ అనుమానం రాకుండా కొత్త దుస్తులు, గాజులు, కాళ్ల పట్టీలు కొనిచ్చినట్లు గుర్తించారు. అనంతరం నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాలకు తీసుకెళ్లి బాలికను విక్రయించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యంకాక తిరిగి దెగ్లూర్కు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
దెగ్లూర్లో బాలికతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని మద్నూర్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా, త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో ముందస్తు ప్రణాళిక ప్రకారం బాలికను అపహరించి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైనది. నిందితుడి వద్ద నుంచి ప్రయాణానికి సంబంధించిన రైలు టికెట్, బాలిక ధరించిన పాత దుస్తులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలికను క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.
నిందితుడు మద్నూర్ మండలం తడి హిప్పర్గా కు చెందిన హర్నే రాజేందర్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ. చిన్నారుల భద్రత విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలను అపరిచితులు లేదా ఇతరుల వద్ద నిర్లక్ష్యంగా వదిలివేయరాదని, ఎవరైనా అనుమానాస్పదంగా చిన్నారులతో సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు.
చిన్నారులపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీసులు జీరో టాలరెన్స్ విధానంతో పనిచేస్తున్నారని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించి, బాలికను సురక్షితంగా రక్షించిన బాన్సువాడ డీఎస్పీ పర్యవేక్షణలో పనిచేసిన మద్నూర్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది, ప్రత్యేక దర్యాప్తు బృందం , సాంకేతిక బృందాన్ని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందించారు.






