10 April, 2026 | 10:00 PM

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలి

10-04-2026 08:06 PM

రాజన్న సిరిసిల్ల,(విజయ క్రాంతి): అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహించే కార్యక్రమాలపై జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి,దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ,పట్టణ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా వాహనదారులతో ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రతిజ్ఞ చేయించాలన్నారు. విద్యార్థులకు హెల్మెట్,సీట్ బెల్ట్  వినియోగం,మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించలన్నారు.ప్రజల్లో రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచేందుకు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేయాలన్నారు.గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ట్రైనింగ్ ద్వారా ప్రమాదాల సమయంలో తక్షణ సహాయం అందించేలా పోలీస్, అంబులెన్స్ సిబ్బంది, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేవలం జరిమానాలు విధించడం కాకుండా, కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించడం ద్వారా కూడా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రజలు,వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు.

రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా 

రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వారి కార్యకలాపాలు నిరంతరం పర్యవేక్షిస్తూ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సత్ప్రవర్తన దిశగా అడుగులు వేయించేలా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు.అలాగే, నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవనం సాగిస్తున్న వారిని గుర్తించి, అటువంటి వ్యక్తులపై ఉన్న షీట్స్ తొలగించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాస్, సి.ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.