రైతులకు క్షమాపణలు
- ధాన్యం సేకరణ ఆలస్యమైంది నిజమే!
- 50 శాతం ధాన్యంసేకరణ పూర్తి
- రానున్న మూడేళ్లలో పదివేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): తాలు ఉందని ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతులని ఇబ్బం ది పెడుతున్నారని త్వరలో ఇబ్బందులను పరిష్కరిస్తామని, రైతులు క్షమించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిల్లర్లు తేమ శాతం అధికంగా ఉం దని ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో కొనుగోలు ప్రక్రి య కొంత ఆలస్యమైందని, ఇప్పటికే 50 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసేలా అధికారులతో, కలెక్టర్‌తో ని రంతరం సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు.
రానున్న మూడేళ్లలో 10 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా తెలంగాణలో ప్రభుత్వం ఒక్కో గృహానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తుండటం విశేషమన్నారు. ఇతర రాష్ట్రాల్లో కేవలం రూ.1.70 లక్షల వరకు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. నల్గొండ పట్టణంలో ఇప్పటికే సు మారు 700 ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం చేపట్టామని, ఎల్ 2, ఎల్ 3 కేటగిరీలకు సంబంధించిన సమస్యలను క్యాబినెట్‌లో చర్చించి త్వరలో పరిష్కరిస్తామన్నారు.
నల్లగొండ నియో జకవ ర్గానికి 10వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. అవసరమై తే అదనంగా 5000 ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. పట్టణంలో దేవరకొండ రోడ్డు, నార్కట్‌పల్లి రోడ్డు, తిప్పర్తి రోడ్డు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని, తర్వాత ఇందిరమ్మ కాలనీ నిర్మాణం చేపడతామన్నారు. గతంలో కలెక్టరేట్ వెనుక భాగంలో జర్నలిస్టులకు 8 ఎకరాల స్థలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్యాబినెట్‌లో పరిశీ లించామని, త్వరలో కలెక్టర్‌తో మాట్లాడి అవసరమైతే సీఎం దృష్టికి తీసుకుపోయి జర్నలిస్టులకు ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు.
వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్, కార్పొరేటర్లు వేణుగోపాల్ రెడ్డి, మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.






