పది ఫలితాల్లో జగిత్యాలకు 4వ స్థానం
కరీంనగర్‌కు 8, సిరిసిల్ల 15, పెద్దపల్లి 16వ స్థానం
కరీంనగర్, ఏప్రిల్29 (విజయక్రాంతి): ఎస్‌ఎస్సి పరీక్షలలో జగిత్యాల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో నాలుగవ స్థానం దక్కింది.జిల్లా అద్భుత విజయంతో 98.87%తో రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లా మొత్తంగా 12687 మంది విద్యార్థులకు గాను 12544 మంది విద్యార్థులు అద్భుతంగా విజయాన్ని సాధించారని ,గతంలో నాలుగవ స్థానం మరియు ఇప్పుడు కూడా అదే స్థానాన్ని నిలుపుకోవడం ఇట్టి విజయానికి కృషిచేసిన జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము, వివిధ మండలాల విద్యాధికారులను , పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇదే స్ఫూర్తిని మునుముందు కొనసాగించాలని ఆకాంక్షించినారు.
కరీంనగర్ జిల్లా 8వ స్థానం
పదవ తరగతి ఫలితాలలో కరీంనగర్ జిల్లా రాష్ట్ర స్థాయిలో 98.57 శాతం ఉత్తీర్ణతతో 8వ స్థానంలో నిలిచింది. పరీక్షకు హాజరైన 6851 మంది బాలురకు 6734 మంది ఉత్తీర్ణులై 122 మంది అనుత్తీర్ణులైనారు. బాలికలలో 6281 మందికి 6215 మంది ఉత్తీర్ణులై 66 మంది అనుత్తీర్ణులైనారు.
ఈ సారి జిల్లాలో మొత్తం 13137 మందికి 12949 మంది ఉత్తీర్ణులై 188 మంది పరీక్షలలో తప్పారు. గతం కంటే మెరుగైన ఫలితాలను సాధించినందుకు ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యాశాఖ అధికారులను ప్రత్యేక చొరవ చూపిన ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దపల్లి 16వ స్థానం
పదవ తరగతి ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద బుధవారం తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాల్లో మొత్తం 7,488 మంది విద్యార్థులు (బాలురు 3674, బాలికలు 3814) హాజరుకాగా, వారిలో 7,316 మంది (బాలురు 3566, బాలికలు 3750) ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.జిల్లాలో 97.70 శాతం ఉత్తీర్ణత నమోదైందని, రాష్ట్ర స్థాయిలో పెద్దపల్లి జిల్లా 16వ స్థానాన్ని కైవసం చేసుకుందని ఆమె వెల్లడించారు.
సిరిసిల్ల 15వ స్థానం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7310 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు అయినారు. 7145 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినారు. జిల్లా ఉత్తీర్ణత శాతం 97.74 శాతం. బాలురల ఉత్తీర్ణత శాతం 96.77, బాలికల ఉత్తీర్ణత శాతం 98.65. రాష్ట్ర స్థాయిలో జిల్లా 15 స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాధికారి డా. బి. జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.






