2 May, 2026 | 3:56 AM

కార్మిక వ్యతిరేక సర్కార్

02-05-2026 02:34 AM
  1. రెండేళ్లు భరించండి.. కేసీఆర్ వచ్చి మేలుచేస్తారు
  2. అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులపై చిన్నచూపు
  3. 120 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందన లేదు 
  4. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలి 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి) : కార్మిక వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రెండేళ్లు భరిస్తే మళ్లీ కేసీఆర్ వచ్చి కార్మికులకు మేలు చేస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా సమయంలో కార్మికులను కడుపులో పెట్టుకొని చూశామని, ఇతర రాష్ట్రాల కార్మికుల కోసం కేసీఆర్ ఉచిత రైళ్లను ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలోని వలస కూలీల కోసం అం డగా నిలబడిన ప్రభుత్వం బీఆర్‌ఎస్ పార్టీ, లేబర్ క్యాంపుల దగ్గరికి వెళ్లి మరీ వారిని కాపాడుకున్నామని తెలిపారు.

లేబర్ క్యాంపుల వద్దకు వెళ్లి వారికి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకున్నా మని, పొరుగు రాష్ట్రాల కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం కడుపులో పెట్టి చూసుకుంటే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ టన్నెల్ కూలీ సొరంగంలో చనిపోతే కనీసం శవాలను కూడా బయటకు తీయలేని దుస్థితిలో ఉన్నదని విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మేడే వేడుకల్లో కేటీఆర్ మాట్లాడారు.

సిగాచి పరిశ్రమలో దాదాపు 60 మంది సజీవ దహనమైతే ఆ కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇస్తామన్న నష్టపరిహారాన్ని కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.  ఒక్క మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వంగాని ఈ అంశంలో ఇప్పటిదాకా స్పందించలేదని, చివరికి నగరానికి బతకడానికి వచ్చిన కూలీలు, కార్మికుల ఇండ్ల మీదికి బుల్డోజర్లు పంపిస్తున్నారని మండిపడ్డారు.  కొవిడ్ సమయంలో అందరూ ఇళ్లలో ఉం టే.. తాము రోడ్లు, వంతెనలు పూర్తి చేశామన్నారు.

తెలంగాణ అంటే ప్రేమ ఉంది కాబ ట్టే.. లాక్‌డౌన్‌లో రోడ్లు, వంతెనలు నిర్మించామని స్పష్టం చేశారు. సఫాయీల శ్రమను సీఎం రేవంత్రెడ్డి గుర్తించడం లేదని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూ స్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక సర్కార్ నడుస్తోందని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కాంగ్రెస్ బాధితులయ్యారని, మంత్రుల జీతాల్లో కోతవేసి ఇస్తామనడానికి వాళ్లు వరద బాధితులా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 120 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఆటో అన్నలను ఆదుకుంటామని ఎన్నికలప్పుడు హామీలిచ్చిన ప్రభుత్వం వారికి మొండి చేయి చూ పించిందని, స్వయంగా రాహుల్ గాంధీని ఆటోలో దింపి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్న ఆటోడ్రైవర్ పరిస్థితి ఉన్న రెండు ఆటోలు అమ్ముకొని కార్మికుడిగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్, విద్యాశాఖలను సీఎం తన వద్దే పెట్టుకున్నారని.. దీంతో ఆ వ్యవస్థలు కుప్పకూలే స్థాయి కి చేరుకుంటున్నాయన్నారు.

సీఎం హోదా లో ఉన్న వ్యక్తి రాష్ట్రం దివాలా తీసిందనడం భావ్యమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. 100 రోజుల్లో ౬ గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి దాదాపు రెండున్నర సంవత్సరాలు అయినా ఒక్కదానిని పట్టించుకోలేదని, కేవ లం అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు. రెండున్నర ఏళ్లలో మూడు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక్కరంటే ఒక్కరికి కూడా మంచిచేయని అరాచక మైనది కాంగ్రెస్ ప్రభుత్వ మన్నారు.

కేసీఆర్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, వెల్ఫేర్ బోర్డు ద్వారా 27 లక్షల మంది కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని,  ప్రమాద భీమా, వైద్యం, వివాహ కానుక, ప్రసూతి కానుకలు, కేసీఆర్ కిట్ ఇలా అనేక అంశాలు కార్మికుల కోసం ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో ఐదు లక్షల ప్రమాద భీమాను కేసీఆర్ ఇస్తే అది కూడా తీశారని, గీత కార్మికులు, నేత కార్మికులకు ఇచ్చిన ప్రమాద భీమాను కూడా తీసే శారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దేశంలో అనేక చోట్ల ఎర్రజెండా పార్టీలు ఉన్నా, తెలంగాణలో మా ప్రభుత్వ హయాంలో జరిగి నన్ని కార్మిక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని, అంగన్వాడీలకు, పారిశుద్ధ్య కార్మికులకు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా గౌరవప్రదమైన విధంగా జీతాలను భారీగా పెంచారని గుర్తు చేశారు. ఇప్పుడు అంగన్వాడీలు జీతాలు పెంచమంటే వారిని అరెస్టులు చేస్తున్నారని, కోసుకుతిన్నా జీతాలు పెంచేదిలేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. 

నడ్డి విరుస్తున్న కేంద్రం... 

చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భారీగా 1000 రూపాయలు పెంచి పేదలకు కార్మికులకు మేడే కానుక మోడీ ఇచ్చారని, పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన సిలిండర్ ధరతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని, హోటల్లో పనిచేసే కార్మికులకు, స్వయం ఉపాధి పైన ఆధారపడిన ప్రతి ఒక్కరికి పెంచిన ధర తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తుందని మండిపడ్డారు. మే డే రోజున ప్రధానమంత్రి మోదీ కార్మికులందరికీ మే డే కానుకగా ఈ ధరల పెంపు ఇచ్చారని ఎద్దేవా చేశారు.

రూ.1000 సిలిండర్ ధర పెరగడం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని, హైదరాబాద్‌లో రూ.3,315 కు కమర్షియల్ సిలిండర్ ధర అంటే రెస్టారెంట్లు, హోటళ్లు మూత వేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మం ది కార్మికుల ఉపాధికి ఇబ్బంది అవుతుందన్నారు. ఇప్పటికే ఇరాన్ యుద్ధం పేరుతో హోటళ్లలో, రెస్టారెంట్లలో పనిచేసేవారి పరిస్థితి, వాటిపై ఆధారపడిన వ్యక్తుల ఉపాధి తగ్గిపోయిందని, చివరికి బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్‌ను కూడా మోదీ వదిలిపెట్టలేదన్నారు.

పెంచిన గ్యాస్‌ధరతో భారీగా రోజువారీ టిఫిన్‌లు, భోజనం ఖర్చులు భారీగా పెరిగి అందరినీ ఇబ్బం ది పెడుతుందని, ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది, మరోవైపు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతుందన్నారు. ఒకప్పుడు ఉద్యో గాలు అడిగితే పకోడీలు వేసుకోమన్న మో దీ, ఈ పెంచిన సిలిండర్లతో పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. చమురు ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నుంచి భారీగా దోచుకుంటున్న బీజేపీ ప్రభుత్వం సెస్ పేరుతో 65 రూపాయలు ఉన్న పెట్రోల్‌ను రూ. 110 120 కి పెంచిందని పేర్కొన్నారు. ఇలా అడ్డగోలుగా పెంచిన సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలతో అన్నిటి ధరలు పెరిగిపోయాయని, మళ్ళీ ఇప్పుడు ఇంత భారీగా సిలిండర్ ధర పెంచితే సామాన్యుడు బతికేదెట్లా? అని ప్రశ్నించారు.  సమా వేశం అనంతరం కార్మికులతో కలిసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు.