27 June, 2026 | 1:32 AM

రాజకీయాల్లో బహుజనుల వాటా కావాలి

27-06-2026 12:00 AM
  1. సాహూ మహారాజ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి 
  2. ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త పూర్ణచంద్రరావు

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): సామాజిక న్యాయానికి ఆద్యుడు, రిజర్వేషన్లకు మార్గదర్శి, బహుజన రాజ్యాధికారానికి పునాది వేసిన మహనీయుడు ఛత్రపతి సాహూ మహరాజ్ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు (రిటైర్డ్ ఐపీఎస్) హాజరై మాట్లాడారు. 

స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండు వందల కులాలకు చెందిన వారు ఇప్పటికీ ఒక్కరూ ఎమ్మెల్యే కాకపోవడం ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి పెద్ద వైఫల్యమని అన్నారు. జనాభాలో   26 శాతమున్న 124 కులాల్లో ఒక్కరూ ఎమ్మెల్యే కాలేదన్నారు. ఇదే పరిస్థితి 18 బీసీ ముస్లింలకు, 57 ఎస్సీ కులాలకు ఎరుకల యానాది చెంచు నక్కల ఎస్టీ కులాలకు దాపురించిందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం బీసీ సమాజంలో కేవలం 10 బీసీ కులాలే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాయని తెలిపారు. ఈ 10 కులాల జనాభా కలిపి సుమారు 25 శాతం మాత్రమే కాగా, మిగిలిన 124 బీసీ కులాలు కలిపి సుమారు 26 శాతం జనాభా ఉన్నప్పటికీ ఒక్కరు కూడా శాసనసభలో ఎమ్మెల్యే సీటు పొందలేకపోయాయని పేర్కొన్నారు.

గత 16 సాధారణ ఎన్నికల్లో బీసీలకు లభించిన ఎమ్మెల్యే స్థానాలు వారి జనాభా వాటాతో పోలిస్తే కేవలం 40 శాతం మేరకే పరిమితమయ్యాయని, ఇది సామాజిక న్యాయ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని అన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలను కలిపి పరిశీలిస్తే సుమారు 200కు పైగా కులాలు స్వాతంత్య్రం వచ్చిన 78 సంవత్సరాల తరువాత కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేలను ఎన్నుకునే అవకాశం పొందకపోవడం ప్రజాస్వామ్యంలోని తీవ్రమైన అసమానతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

చాలా కాలంగా రెడ్డి, కమ్మ కులాల ఆధిపత్యం కొనసాగడం వల్లే వందలాది బహుజన కులాలు రాజకీయ అధికారానికి దూరమయ్యాయని ఆయన విమర్శించారు. సాహూ మహారాజ్ చూపిన మార్గం కేవలం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకే పరిమితం కాదు. రాజకీయ అధికారంలోనూ బహుజనులకు సమాన భాగస్వామ్యం కల్పించడమే నిజమైన సామాజిక న్యాయం అని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్లో కుల గణన నిర్వహించి, జనాభా నిష్పత్తి ఆధారంగా అన్ని సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విధంగా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో సంస్కరణలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వీరవల్లి శ్రీనివాస్ పీవీ రమణయ్య నిర్వహించిన బహుజన మాట, పాట కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు, బహుజన నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ముఖ్యంగా ప్రముఖ వైద్యులు డా అల వెంకటేశ్వర్లు, బి పరంజ్యోతి, సంగెం సూర్యారావు, నారగోని, గుమ్మడి శ్రీనివాస్ యాదవ్, డిఎం. స్వామి, ఉప్పాల భాస్కరరావు, డా. పి. పురందరరావు, ధన్వాల రజనీకాంత్, డా. చింకా అనిల్ కుమార్, ఫ్రంట్లైన్ శ్రీనివాసరావు, డి. దేవరాజు, శ్రీమతి కె. జయసుధ, కె. సాంబశివరావు, మేకల సుబ్బారావు, కొల్లబత్తి నాగేశ్వరరావు, వరగాని వివేకానంద, వై. శ్రీనివాసరావు, కటారి వెంకటేశ్వరరావు, తాటికొండ నరసింహరావు, కొల్లి రామకృష్ణ, మాదాల చంద్రి ఫూలే, ముమ్మడి వెంకట కోటయ్య యాదవ్, అరివుల గురుస్వామి, శ్రీమతి రాయపాటి నివేదిత, ముమ్మడి జయదుర్గ, డా. పోతుల అంకయ్య, ఎన్.కె. రేహమాన్ తదితరులు పాల్గొని శాహూ మహారాజ్ ఆశయాలను గ్రామగ్రామాన చాటిచెప్పాలని, బహుజన సమాజానికి రాజకీయ అధికారం సాధించే దిశగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.