27 June, 2026 | 1:54 AM

పగటి దోపిడీ..!

27-06-2026 12:34 AM

ప్రభుత్వ పుస్తకాల పేరుతో అక్రమ వ్యాపారం ఎంఆర్పీకి తూట్లు.. 

10 శాతం అదనపు వసూళ్లు..!

ప్రశ్నిస్తే ‘పుస్తకాలు లేవు‘ అంటూ వ్యాపారుల బెదిరింపులు..!

విద్యార్థుల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారుల దందా..?

వనపర్తి, జూన్ 26 (విజయక్రాంతి): పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాలి.. కానీ అదే పుస్తకాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారుతున్నాయా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయాల పేరుతో కొందరు జనరల్ స్టోర్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగా పుస్తకాలు విక్రయించాల్సి ఉండగా.. కొందరు వ్యాపారులు ఎంఆర్పీ ధరలపై అదనంగా 10 శాతం వరకు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

‘ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు?‘ అంటే ..

‘ఇంత రేటు ఎందుకు?‘ అని అడిగితే సమాధానం చెప్పాల్సింది పోయి..‘పుస్తకాలు కావాలంటే తీసుకోండి.. లేకపోతే వెళ్లండి.. స్టాక్ లేదు‘ అంటూ దబాయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చదువు కోసం తప్పనిసరిగా కొనాల్సిన పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

చిన్నారుల చదువుపై లాభాల వేట..!? 

విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సిన చోట.. వాటిని వ్యాపార వస్తువులుగా మార్చడం ఎంతవరకు సమంజసమని విద్యావంతులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఫీజులు, యూనిఫారాలు, నోట్బుక్స్ పేరుతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు పుస్తకాల ధరల పేరుతో మరో భారం మోపడం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తనిఖీలు ఎక్కడ..? 

ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తనిఖీలు లేకపోవడంతోనే వ్యాపారుల ఆగడాలు పెరుగుతున్నాయా..? లేక మౌనమే అంగీకారమా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పుస్తకాలపై దందా ఆపాలి..! 

విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేసే హక్కు ఎవరికీ లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రభుత్వ పుస్తకాల పేరుతో సాగుతున్న ఈ అక్రమ వసూళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా..? లేక యథావిధిగా మౌనం వహిస్తారా..? అధికారులు మద్దత్తు విద్యార్థుల వైపా లేకపోతే అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారుల వైపా అనేది వేచి చూడాల్సిందేనన్న ప్రశ్న ఆసక్తిగా మారింది.