బదిలీల పేరుతో జరుగుతున్న అవినీతిపై విచా రణ జరపాలి
కొత్తపల్లి, మే 21(విజయక్రాంతి):కరీంనగర్ పట్టణం మంకమ్మతోట డివైఎఫ్‌ఐ కార్యాలయం లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం రోజున పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి ఓ నంబర్ 38, తేదీ 21-04-2026 ద్వారా ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి 2026 మే 1 నుండి మే 31 వరకు బదిలీల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, ఎస్సీఎస్టీ సంక్షేమ శాఖల్లో జరుగుతున్న బదిలీల వ్యవహారం తీవ్ర అనుమానాలకు తావిస్తున్నదని నరేష్ పటేల్ ఆరోపించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే స్థానంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉన్నప్పటికీ, జిల్లాలో కొందరు ఉద్యోగులు ఎనిమిది నుంచి పది సంవత్సరాలకు పైగా ఒకే చోట కొనసాగుతున్నారని తెలిపారు. సాధారణ ఉద్యోగులకు ఒక న్యాయం, పలుకుబడి ఉన్న వారికి మరో న్యాయం అమలు చేయడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
అదేవిధంగా ఎన్న్యు మెటర్ అపాయింట్ లెటర్ నెం No.0001/ENU/0505/ఈఎమ్-29703100010, తేదీ 02-05-2026 ద్వారా ఒక ఉద్యోగికి జనాభా గణన సెన్సస్ ఎన్యు మేటర్ విధులు కేటాయించినప్పటికీ, అదే ఉత్తర్వులో 24-04-2026, 25-04-2026, 26-04-2026 తేదీలలో శిక్షణ నిర్వహించినట్లు నమోదు కావడం అనేక సందేహాలకు తావిస్తోందన్నారు. నియామక ఉత్తర్వు వెలువడకముందే శిక్షణ ఎలా నిర్వహించబడిందో అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే బీఎల్‌ఓ సూపర్వైజర్ వంటి బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు ఉద్యోగులకు ప్రత్యేకంగా సెన్సస్ డ్యూటీలు లేదా ఇతర ప్రత్యేక విధులు కేటాయించి బదిలీల నుంచి మినహాయింపులు కల్పిస్తున్నారని తెలిపారు. ఒకే వ్యక్తికి వరుసగా ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో జిల్లా అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.మరోవైపు కొందరు ఉద్యోగులు గతంలో స్పౌస్ గ్రౌండ్ ఆధారంగా ఇప్పటికే రెండు సార్లు బదిలీ ప్రయోజనం పొందినప్పటికీ, సంవత్సరాల తరబడి అనుకూల కేంద్రాల్లో కొనసాగుతూ ప్రస్తుతం మూడోసారి కూడా అదే ప్రాతిపదికన బదిలీలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
ఒకే ఉద్యోగికి పదేపదే ప్రత్యేక మినహాయింపులు కల్పించడం వల్ల నిజంగా అర్హులైన ఉద్యోగులు బదిలీ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సీబీఐ లేదా ఏసీబీతో స్వతంత్ర విచారణ జరిపించి, ఎస్సీఎస్టీ సంక్షేమ శాఖల్లో జరిగిన అన్ని బదిలీలను పున సమీక్షించాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్ నగర అధ్యక్షులు అకల్ సింగ్, నాయకులు అజేయ్, చందు, భూమే ష్, శ్రీనివాస్ రెడ్డి,మొహ్మద్ కలీల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.






