రైతు రాజయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
- వడ్లు కొనుగోలు చేయక రైతు ఆత్మహత్య
- మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్, మే 21 (విజయక్రాంతి) : రైతు రాజయ్య మృతి చెందడం చాలా బాధాకరమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట్ మండలంలోని అంబాజీపేట గ్రామానికి చెందిన రైతు రాజయ్య వడ్లు కొనుగోలు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పద్మా దేవేందర్ రెడ్డి గురువారం మండల నాయకులతో కలిసి గ్రామానికి చేరుకొని రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు.
అనంతరం మెదక్ జిల్లా ఆస్పత్రి మార్చురీ గదిలో ఉన్న రాజయ్య మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు కాకపోవడం, అప్పులు ఎలా తీర్చాలో తెలియక రాజయ్య తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాజయ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెదక్ జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. వీరి వెంట చిన్నశంకరంపేట్ మండల పార్టీ అధ్యక్షులు పట్లోరి. రాజు, నాయకులు ప్రభాకర్, పడాల శ్రీనివాస్, మల్లుపల్లి సర్పంచ్ నరేష్ తదితరులు ఉన్నారు.






