4 July, 2026 | 3:28 AM

విద్యతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రతకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి

04-07-2026 02:25 AM

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

హనుమకొండ, జూలై 3 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల పరిసరాల పరిశుభ్రత అలవర్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మడికొండలోని  ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు, భోజనశాల, తాగునీటి సౌకర్యాలు, తరగతి గదులు, వసతి గృహాలు, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భోజనశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్న తీరును, ఆహార నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం డైనింగ్ హాల్, తరగతి గదులు, మరుగుదొడ్లలో పారిశుధ్య లోపాలను గమనించి సంబంధిత అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరుగుదొడ్లలో నిరంతరం నీరు వృథాగా ప్రవహించడం, దుర్వాసన వెదజల్లడం, పరిశుభ్రత లేకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, బాధ్యులైన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య లోపాల వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్న కలెక్టర్, పాఠశాల ఆవరణ, తరగతి గదులు, భోజనశాల, వసతి గృహాలు, మరుగుదొడ్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.