25 June, 2026 | 12:09 AM

300 నగరాలకు విస్తరించనున్న అమెజాన్ నౌ

24-06-2026 11:02 PM

న్యూఢిల్లీ, జూన్ 24: 

దేశవ్యాప్తంగా 300 నగరాల్లోని వినియోగదారులకు, నిమిషాల్లో అతివేగంగా డెలివరీ చేసే తన అమెజాన్ నౌ సేవను విస్తరించడం ద్వారా, భారతదేశంలోనే అతిపెద్ద 'నిమిషాల్లో డెలివరీ' నెట్‌వర్క్‌ను నిర్మించనున్నట్లు అమెజాన్  ప్రకటించింది. ప్రారంభించినప్పటి నుండి ప్రతి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపు అవుతుండటంతో,  అమెజాన్ ఇండియా చరిత్రలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కామర్స్ వ్యాపార విభాగంగా అమెజాన్ నౌ అవతరించింది.

దేశవ్యాప్తంగా వినియోగదారు లకు, వారికి అవసరమైనప్పుడు, అత్యధిక రకాల ఉత్పత్తులను అందించడానికి అమెజాన్ తన ప్రత్యేకమైన ఫుల్‌ఫిల్‌మెంట్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తుంది. ఇందులో భాగంగా పదివేల ఉత్పత్తులను నిమిషాల్లో లేదా కొన్ని గంటల్లో డెలివరీ చేయడం, అదే రోజులో పది లక్షలకు పైగా, మరుసటి రోజు నలభై లక్షలకు పైగా ఉత్పత్తులను అందించడం, ఇంకా అపరిమిత, ఉచిత & వేగవంతమైన ప్రైమ్ డెలివరీతో కోట్లాది ఉత్పత్తులను అందించడం వంటివి ఉంటాయి.

అమెజాన్ తన ఇ-కామర్స్, క్విక్ కామర్స్ వ్యాపారంలో పనిచేస్తున్న పదివేల మంది డెలివరీ అసోసియేట్‌ల సంక్షేమంపై దృష్టి సారించిన 'సమ్మాన్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. కార్యకలాపాలు, అసోసియేట్‌ల సంక్షేమం కోసం అమెజాన్ ఇండియా ఇటీవల ప్రకటించిన 30 కోట్ల డాలర్ల పెట్టుబడిలో కొంత భాగం ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి కేటాయించబడుతుంది.

వినియోగదారుల నుండి, ముఖ్యంగా ప్రైమ్ సభ్యుల నుండి గొప్ప స్పందన లభిస్తోందనీ, వారి షాపింగ్ ఫ్రీక్వెన్సీని మూడు రెట్లు పెంచుతున్నారనీ అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ చెప్పారు.  డెలివరీ అసోసియేట్ల సంక్షేమంపై దృష్టి సారించిన 'సమ్మాన్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాము వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, ఆ వేగానికి శక్తినిచ్చే వ్యక్తులు కూడా మాతో పాటు అభివృద్ధి చెందుతారని, వారికి మెరుగైన ఆరోగ్యం, శ్రేయస్సు, వారి కుటుంబాలకు విద్యా సహాయం, ప్రతిరోజూ సురక్షితమైన పని వాతావరణం లభిస్తాయని తెలిపారు.

అమెజాన్ నౌ వేగవంతమైన విస్తరణ: బెంగళూరు, దిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, పుణె, హైదరాబాద్, అమృత్‌సర్, కొచ్చి వంటి 15కు పైగా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో, అమెజాన్ నౌ ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వినియోగదారులకు అందుబాటులో ఉంది. కిరాణా సామాగ్రి (పండ్లు & కూరగాయలు, ఫ్రోజెన్ ఫుడ్‌తో సహా), పర్సనల్ కేర్, ఫ్యాషన్ & బ్యూటీ ఉత్పత్తులు మొదలుకొని చిన్న గృహోపకరణాలు, గృహ & వంటగది ఉత్పత్తులు, మరెన్నో నిత్యావసర వస్తువుల విస్తృత శ్రేణిని అందించడానికి, అమెజాన్ తన మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, అర్బన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల నెట్‌వర్క్‌ను విస్తరించాలని యోచిస్తోంది. ఇవన్నీ నిమిషాల్లోనే డెలివరీ చేస్తాయి.