తెలంగాణ సాధనలో ఉద్యమకారులు సజీవం
* త్యాగాల పునాదులపైన తెలంగాణ రాష్ట్రం: రాపోలు నవీన్ కుమార్
గరిడేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ చరిత్రలో ఉద్యమకారులు సజీవంగా ఉంటారని, ప్రతి ఉద్యమకారుడు ఒక సజీవ అధ్యాయంగా నిలిచిపోతారని హుజూర్నగర్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రాపోలు నవీన్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానానికి సిద్ధం అయి తన రెండు కాళ్ళు, ఎడమ చేతిని పోగొట్టుకున్న ఉద్యమ కారుడు పిడమర్తి నాగరాజును ఆయన స్వగ్రామమైన గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలో కలసి సన్మానించి ఉద్యమ కారుడి తో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్బంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ... ఉద్యమం ముగిసినా తెలంగాణ ఉద్యమకారుల గౌరవం ఎప్పటికీ మసిబారాదని, తెలంగాణ చరిత్రలో ప్రతి ఉద్యమకారుడు ఒక సజీవ అధ్యాయం అని తెలిపారు. ఉద్యమకారుల త్యాగాల పునాదిపైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉద్యమకారులని పట్టించుకున్న పాపాన పోలేదు అని ఆరోపించారు. ఉద్యమం కోసం తన రెండు కాళ్ళు, ఒక చేయి పోగొట్టుకున్న నాగరాజు ను అన్ని విధాల ఆదుకోవాలని, హుజుర్నగర్ లో ప్రతిష్టత్మాకంగా నిర్మిస్తున్న ఇళ్లలో మొట్ట మొదటి గా నాగరాజు కి ఇవ్వాలి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.






