జెన్ జీ వైపే చూపు
యువ నాయకత్వానికి పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది!.. పదండి ముందుకు, పదండి త్రోసుకు! అంటూ దేశంలోని యువత ఇప్పుడు కదం త్రోక్కుతూ, పదం పాడుతూ మరో ప్రపంచంవైపు అడుగులేస్తోంది. నెత్తురు మండించుకుంటూ, శక్తులు నింపుకొంటూ ప్రభంజనం వలె, ప్రళయఘోష వలె కదులుతోంది. దేశ భవిష్యత్ యువతరం చేతుల్లోనే ఉందనే స్ఫూర్తిని రగిలించిన భగత్‌సింగ్ మొదలు అంబేద్కర్ వరకు ఎందరో మహానుభావులను ఆదర్శంగా తీసుకుంటున్నది.
దేశ నిర్మాణంలో కేవలం భాగస్వా ములం మాత్రమే కాదు, మార్పును తీసుకొచ్చే గొప్ప శక్తి తమలో ఉందని జెన్ జీకి అవగతమైంది. తమ హక్కులను, ఆకాంక్షలను ప్రభుత్వాలు, పాలకులు నెరవేర్చపోతే పోరాడి సాధించుకోవచ్చుననే విషయం స్పష్టమైంది. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ ఉద్యమమే దీనికి నిదర్శ నం. ఢిల్లీలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర చర్చకు దారితీయడంతో పాటు తమ సమస్యల పరిష్కారం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా నడుం బిగించేలా చేసింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ వైపు చూసేంతగా ఈ జెన్ జీ ఉద్యమం ప్రభావం చూపింది.
అయితే ఈ ఉద్యమం తర్వాత యువతలో రాజకీయాలపై ఆసక్తి మరింత పెరిగిందనే చర్చ కూడా సాగుతోంది. కేవలం ఓటర్లుగానే కాకుండా, విధాన రూపకల్పనలోనూ, రాజకీయ నాయకత్వంలోనూ తమ పాత్ర ఉండాలనే ఆకాంక్ష యువతలో పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అందుకే పార్టీలన్నీ యువత ఆకాంక్షలు నెరవేర్చడం, వారిని ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాయి.
క్రాంతి మల్లాడి
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి) : యువశక్తికి చట్టసభల్లోనూ అవకాశం కల్పించాలనే చర్చ దేశ రాజకీయాల్లో కొత్త దిశగా సాగుతోంది. 18 ఏళ్లకే ఓటు హక్కు ఉన్న యువతకు, 21 ఏళ్లకే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి వస్తుంది. ఈ ప్రతిపాదన అమలైతే జెన్ -జీ రాజకీయాల్లోకి మరింత వేగంగా అడుగుపెట్టే అవకాశం ఉండటమే కాకుండా, విద్యా ర్థి ఉద్యమాలు, యువజన నాయకత్వం నేరుగా చట్టసభల్లోకి చేరే మార్గం సుగమమయ్యే అవకాశముంది.
దేశవ్యాప్తంగా యువ ఓటర్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో యువతకు అధిక ప్రాధాన్యం లభించ డం, భారత రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వానికి మార్గం సుగమం కావడం వంటి అంశాలపై చర్చ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశంలో ప్రతి ఎన్నికతో యువ ఓటర్ల ప్రభావం మరింత పెరుగుతోంది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు అనేక నియోజకవర్గాల్లో విజయం ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటు న్నారు.
దీంతో రాజకీయ పార్టీలు కూడా తమ ఎన్నికల వ్యూహాలు, మేనిఫెస్టోలు, ప్రచార శైలిని యువత ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుకుంటున్నాయి. ఉద్యోగాల కల్పన, నాణ్యమైన విద్య, స్టార్టప్లకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆవిష్కరణలు వంటి అంశాలు ఇప్పుడు ఎన్నికల ప్రధాన అజెండా లుగా మారుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో యువ ఓటర్ల అభిప్రాయాలు, స్పందనలు ఎన్నికల ప్రచారాన్నే ప్రభావితం చేస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు కుందించాలని డిమాండ్ చేయడం, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నా చౌక్ వద్ద జెన్ జీ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం, యువతరానికి సమాధానం ఇవ్వాల్సిందేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం యువత ఆలోచనలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 21 ఏళ్లకే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే ప్రతిపాదన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. యువతను కేవలం ఓటర్లుగానే కాకుండా ప్రజాప్రతినిధులుగా కూడా ముందుకు తీసుకురావాలనే వాదన బలపడుతోంది.
యువ ఓటర్లకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలు కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయా పార్టీలు విద్యార్థి సంఘాలు, యువజన విభాగాల నుంచి చురుకుగా పనిచేస్తున్న నాయకులను నేరుగా ఎన్నికల బరిలోకి దించేలా పావులు కదుపుతున్నాయి. దీంతో పార్టీల్లో నాయకత్వ మార్పు వేగవంతం కావడంతో పాటు, టికెట్ల కేటాయింపులో కూడా యువత వాటా పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
యువ ఓటర్ల మద్దతు విజయాన్ని నిర్ణయించే స్థాయికి చేరుతున్న వేళ, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించకుండా ఏ పార్టీ కూడా ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే యువత సమస్యల పరిష్కారం, వారి ఆకాంక్షలకు అనుగుణంగా హామీలు ఇవ్వడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజకీయాల్లో యువశక్తి కేవలం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఓటు బ్యాంక్‌గా కాకుండా, విధానాలను నిర్ణయించే నాయకత్వ శక్తిగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యువ నాయకత్వానికే పెద్దపీట..
దేశ రాజకీయాల్లో అనేక మంది ప్రముఖ నాయకులు విద్యార్థి ఉద్యమాల నుంచే తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు విద్యార్థి ఉద్యమాలు, యువజన సంఘాలు, పార్టీ యువ విభాగాల్లో చురుకుగా పనిచేసే నాయకులు చట్టసభల్లోకి రావాలంటే 25 ఏళ్లు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చేది. వయోపరిమితి తగ్గితే యువ నాయకులు నాలుగేళ్ల ముందుగానే ప్రజల తీర్పు కోరే అవకాశం పొందుతారు. ప్రస్తుతం ఎక్కువ పార్టీల్లో సీనియర్ నాయకత్వమే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుండగా, ౨౧ ఏళ్లకే చట్టసభలకు ఎంపికైతే.. యువ నాయకులకు పార్టీ నిర్ణయాత్మక వ్యవస్థలోనూ వారి పాత్ర విస్తరించే అవకాశముంది.
దేశ జనాభాలో అత్యధిక శాతం యువతే ఉన్న నేపథ్యంలో, అదే వర్గానికి చెందిన నాయకులు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతోపాటు విద్యార్థి ఉద్యమాలు రాజకీయ నాయకత్వాన్ని తీర్చిదిద్దే వేదికలుగా మరింత బలోపేతం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో యువత రాజకీయాల్లో భాగస్వామ్యం పెరగడమే కాకుండా, కొత్త తరం నాయకత్వం వేగంగా ఎదిగే అవకాశాలు కూడా మెరుగుపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టికెట్లలోనూ పెరగనున్న ప్రాధాన్యం..
ఆయా రంగాల్లో తమ సమస్యల పరిష్కారం కోసం యువత పోరుబాట పడుతున్నాయి. ఈ క్రమంలో జెన్ జీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గింపు ప్రతిపాదన మరింత ఊపునిస్తుంది. ఇది అమలైతే రాజకీయ పార్టీల టికెట్ పంపిణీలో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు యువతను ప్రధానంగా ప్రచారం, సోషల్ మీడియా, పార్టీ యువజన విభాగాలకే పరిమితం చేసిన పార్టీలు, ఇకపై వారిని నేరుగా ఎన్నికల బరిలోకి దించే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా పట్టణాలు, యూనివర్సిటీలు, ఐటీ ఉద్యోగులు, మొదటిసారి ఓటు వేసే యువత అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో యువ అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అదే సమయంలో యువ ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు కొత్త తరం నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం కూడా పెరగవచ్చు. సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన యువ నాయకులు, విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నవారు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న వారికి టికెట్లు దక్కే అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త తరం ఓటర్లను ఆకర్షించాలంటే కొత్త తరం నాయకత్వానికే రాజకీయ పార్టీలు పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఈ క్రమంలో 21 ఏళ్లకే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే ప్రతిపాదన కేవలం వయోపరిమితి తగ్గింపుగా మాత్రమే కాకుండా, భారత రాజకీయాల్లో తరం మార్పుకు దారితీసే కీలక సంస్కరణగా మారడంతోపాటు దేశ భవిష్యత్ రూపకల్పనలో యువత పాత్ర మరింత పెంచేందుకు దోహదపడుతుంది.






