సీఎం కుర్చీ జాగ్రత్త!
- రేవంత్‌రెడ్డిని కట్టడిచేసేందుకు బీజేపీకి ఐదు నిమిషాలు చాలు
- రాష్ట్రంలో టెన్త్ పేపర్ లీకైతే సీఎం రాజీనామా చేశారా?
- పేపర్ లీకుల అంశంలో కేటీఆర్‌కూ మాట్లాడే నైతిక హక్కులేదు
- ఎవరో ధర్నా చేస్తే ఆ క్రెడిట్ కొట్టేయాలని మోదీ ఇంటి ముందు రాహుల్ ధర్నా: బీజేపీ ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే రేవంత్‌రెడ్డి ఒక్కరోజు కూడా సీఎం కుర్చీ లో కూర్చోలేరని, ఆయనను కట్టడి చేసేందుకు ఐదు నిమిషాలు చాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహ రించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల అవినీతికి సంబంధించిన పూర్తి చిట్టా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మెప్పు కోసం పనిచేయడం ఆపేసి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని ఆమె హితవు పలికారు.
నీట్ పరీక్ష రద్దు చేయగానే రాహుల్ గాంధీ ధర్నా ఎందుకు చేయలేదని, ఎవ రో ధర్నా చేస్తే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీ కొట్టేయాలని మోదీ ఇంటి ముందు ధర్నా చేశారని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన నిరసనలో విద్యార్థుల కంటే బయటి వాళ్లే ఎక్కువ ఉన్నారని, వారికి విదేశాల నుంచి డబ్బులొచ్చాయన్నారు. దీని వెనుకాల ఉన్న శక్తులు ఎవరనే విష యం త్వరలోనే బయటకు వస్తుందనన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తలను భారతీయులు సహించరని, ప్రపంచవ్యాప్తంగా దేశానికి, మోదీకు వస్తున్న కీర్తిని సహించలేకపోతున్నారని మండిపడ్డారు.
ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అసలు ఏం జరిగిందో, అక్కడి చోటుచేసుకున్న అల్లర్లకు బాధ్యులు ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తెచ్చారని ఆరోపించారు.
నైతిక హక్కే లేదు..
కొందరు దేశాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. నేపాల్, బంగ్లాదేశ్‌ల మాదిరిగా భారత్‌ను చేస్తామని కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఏ అరాచక శక్తులు ఇందులో ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు. కేటీఆర్, రేవంత్‌కు పేపర్ లీక్‌పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో గ్రూప్- పాటు ఇతర పేపర్‌లు లీక్ అయ్యాయని, అప్పుడెందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పదోతరగతి పేపర్ లీక్ అయితే.. ఎవరు రాజీనామా చేశారని ప్రశ్నించారు. సరైన సమయంలో అందరికీ తగిన గుణపాఠం చెబుతామని అరుణ హెచ్చరించారు.
నీట్ పేపర్ లీక్ అవ్వగానే పరీక్ష రద్దుచేసి తిరిగి తొందర్లోనే పరీక్ష పెట్టి పొరపాటును కేంద్రం సరిదిద్దిందన్నారు. అప్ పార్టీ కొరకు పనిచేసే ఒక వ్యక్తి మోదీ నాయకత్వాన్ని అస్తిరపరచాలని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దేశ కీర్తీ, మోదీనీ అపహాస్యం చేసేందుకు యువతను ఉసి గోల్పారని, రాహుల్ గాంధీ ప్రతి పక్ష నేతగా ఏ ఒక్క విషయంపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా లేరని, కానీ నల్ల బట్టలు వేసుకొని మాత్రం రోడ్డుపై ధర్నాలు చేస్తారని విమర్శించారు. కర్ణాటక, తెలంగాణ నుంచి యువతకు టికెట్లు ఇప్పించి ఢిల్లీకి రైలు ఎక్కి పంపించారని ఆరోపించారు.
ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..
ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు రేవంత్ సంబరాలు చేస్తూ ర్యాలీ తీస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజలు ఐదేళ్ల కోసం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం హయంలో ఫార్మా ఉద్యోగుల పేపర్ లీక్ అయ్యిందని, కానీ ఇప్పుడు అదే ఆప్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కఠిన చట్టాల రూపకల్పనకు అందరూ ముందుకి వచ్చి మద్దతు ఇవ్వాలని అరుణ కోరారు.
ఢిల్లీకి డబ్బుల మూటలు..
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి జరుగుతుందని, ఆ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు డబ్బుల మూటలు ఢిల్లీకి పంపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరగలేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తన వీపు తాను చూసుకోకుండా సందట్లో సడేమియాల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీడియాలో కొంత మంది మాట్లాడే మాటలు.. చదువు సంస్కారం ఉన్న వాళ్ళు మాట్లాడరని, నేపాల్, బంగ్లాదేశ్‌లా భారత్‌ను చేస్తామని కొందరు రెచ్చగొట్టే వాక్యాలు చేశారన్నారు.
ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఏ అరాచక శక్తులు ఇందులో ఉన్నాయో అన్ని బయటికి వస్తాయన్నారు. మోదీ నాయకత్వాన్ని చూస్తే మీకెందుకంత బాధ, ఈర్ష్య? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లు అన్నం తినే వారిలా కాకుండా గడ్డి తినే వారిలా మాట్లాడుతున్నారన్నారు. యాంటీ నేషనలిస్టులు విదేశాల నుంచి ఆహారం, డబ్బులు పంపించి అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేశారన్నారు. యువత మంచి మార్గంలో నడిచి దేశ సంప్రదాయాలను కాపాడాలని కోరారు.






